Union Minister Nitin Gadkari: నా బ్రెయిన్ విలువ రూ.200 కోట్లు.. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపితే జరిగేది ఇదే!

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ20 పెట్రోల్‌పై వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. ఈ ఇంధనంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం తనను రాజకీయంగా టార్గెట్ చేసేందుకు జరుగుతున్న ఓ 'పెయిడ్ క్యాంపెయిన్' అని ఆయన ఆరోపించారు.

New Update
Nitin Gadkari

Nitin Gadkari

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ20 పెట్రోల్‌పై వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. ఈ ఇంధనంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం తనను రాజకీయంగా టార్గెట్ చేసేందుకు జరుగుతున్న ఓ 'పెయిడ్ క్యాంపెయిన్' అని ఆయన ఆరోపించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ, తనపై వస్తున్న ఆర్థికపరమైన ఆరోపణలను ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన "నా మెదడు విలువ నెలకు రూ. 200 కోట్లు. నిజాయితీగా సంపాదించడం నాకు తెలుసు. నాకు డబ్బుకు కొరత లేదు, నేను దిగజారాల్సిన అవసరం లేదు" అని అన్నారు. ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం వల్ల తన కుటుంబం ఆర్థికంగా లబ్ది పొందుతోందంటూ వచ్చిన ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. తాను తన కుమారులకు కేవలం ఆలోచనలు మాత్రమే ఇస్తానని, ఎలాంటి అవకతవకలకు పాల్పడనని స్పష్టం చేశారు.

ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, దేశంలో చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని గడ్కరీ పునరుద్ఘాటించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా రైతులకు ఎంతో లాభదాయకమని తెలిపారు. మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం వల్ల రైతులకు రూ. 45,000 కోట్ల ఆదాయం లభించిందని గడ్కరీ వివరించారు. ఈ విధానాన్ని వ్యతిరేకించేవారు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ20 ఇంధనంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సుప్రీంకోర్టు కూడా ఈ20 ఇంధనంపై దాఖలైన పిల్ ను తిరస్కరించిందని గడ్కరీ గుర్తు చేశారు. ఈ విమర్శలన్నీ తనను రాజకీయంగా దెబ్బతీయడానికి పెట్రోల్ లాబీలు చేస్తున్న ప్రయత్నాలని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, రైతులకు మంచి జరిగే వరకు తన ప్రయత్నాలు కొనసాగిస్తానని గడ్కరీ స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు