Maoist party: మల్లోజుల, ఆశన్నలు ముమ్మాటికీ ద్రోహులే.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

మావోయిస్టు పార్టీని మోసం చేసిన సోను సతీష్‌ల లొంగుబాటు నిర్ణయం వాళ్ళ దిగజారుడు తనానికి నిదర్శనమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. రాజకీయంగా దిగజారిన ద్రోహులు సోను, సతీష్ లకు మా పార్టీ పంథాను తప్పు పట్టే హక్కు లేదని స్పష్టం చేసింది.

New Update
Telangana Maoists leaders Mallojula Ashanna

Telangana Maoists leaders Mallojula ,Ashanna

Maoist party:  మావోయిస్టు పార్టీని మోసం చేసిన సోను సతీష్‌ల లొంగుబాటు నిర్ణయం వాళ్ళ దిగజారుడు తనానికి నిదర్శనమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. రాజకీయంగా దిగజారిన ద్రోహులు సోను, సతీష్ లకు మా పార్టీ పంథాను తప్పు పట్టే హక్కు లేదని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు స్పష్టం చేసింది. మావోయిస్టు పార్టీ దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథానే కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా లేఖను విడుదల చేసింది.

 సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్, సతీశ్ అలియాస్ ఆశన్నలు అవకాశవాదంతో విచ్ఛిన్నకర వైఖరితో కేడర్‍ను మోసగించి వారిని వెంట తీసుకువెళ్లి మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాల ఎదుట లొంగిపోయారని అభయ్‌ ఆరోపించారు. మల్లోజుల, ఆశన్నలు ప్రభుత్వాలతో ముందుగానే సంప్రదింపులు జరిపి ఒప్పందం చేసుకుని పథకం ప్రకారం లొంగిపోయారని, వీరి సంప్రదింపుల మేరకే రెండు రాష్ట్రాల సరిహద్దులో ఇంద్రావతి నది తీరం, దాని సమీప ప్రాంతాల్లో అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 16వ తేదీల్లో వీరు లొంగిపోయే వరకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించి లొంగుబాటుకు మార్గం సుగమం చేశాయని అభయం ఆ లేఖలో ఆరోపించారు. గడిచిన దశాబ్దాల తమ రాజకీయ ప్రజా జీవితాన్ని మల్లోజుల, ఆశన్నలు ప్రభుత్వంతో కుమ్మక్కై ఈ రకంగా ముగించుకున్నారని విమర్శించారు.

దాదాపు 3 నెలల క్రితమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి సోను లొంగిపోయేందుకు తమతో సంప్రతించారని పత్రికా ముఖంగా ప్రకటించారు. సతీష్ పాత్రికేయుల ద్వారా ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపారు. ఈ సంప్రదింపుల మేరకు, కొద్ది కాలం పాటు ఈ ప్రాంతాలలో ఆపరేషన్ లను నిలిపి వేస్తున్నట్టుగా గఢ్ చిరోలి జిల్లా పోలీసు అధికారి బహిరంగంగా ప్రకటించారని అభయ్‌ అన్నారు. భారత రాజ్యానికి లొంగిపోయిన సోను, సతీష్ తమ రాజకీయ దిగజారుడును కప్పి పుచ్చుకునేందుకు పార్టీ పంథాను తప్పు పడుతున్నారు. ప్రస్తుత దేశ కాల పరిస్థితులలో వచ్చిన మార్పుల కారణంగా దీర్ఘకాలిక ప్రజా యుద్ధ వ్యూహానికి కాలం చెల్లిందని, అందువల్ల సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నామని, బహిరంగంగా ప్రజా పోరాటాలలో పాలు పంచుకుంటామని చెబుతున్నారు. అలాగే మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాళ్ల కేశవరావ్ అమరుడు కావడానికి ముందు ఆయుధాలు విడిచిపెట్టి శాంతి చర్చలకు సిద్ధం కావాలని అన్నారని చెబుతున్నారు. ఇది శుద్ధ తప్పు. సోను. సతీష్ లు వాస్తవాలను వక్రీకరించి చెబుతున్న విషయాలివి.వాస్తవానికి, శాంతి చర్చలకు సంబంధించి సతీష్ అవగాహనలో ఉన్న లోపాలను వివరిస్తూ అమరుడు కామ్రేడ్ నంబాళ్ల కేశవరావ్ అతనికి ఉత్తరాలు రాశారన్నారు.ఆపరేషన్ కగార్‍లో ఎదుర్కొంటున్న నష్టాలను నివారించేందుకు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో 2024 ఫిబ్రవరి, ఆగస్టులలో రూపొందించిన ఎత్తుగడలను అమలు చేసేందుకు దృఢంగా పూనుకోవాలని వివరించారు. కాబట్టి ఆయుధాలు విడిచిపెట్టి శాంతి చర్చలకు వెళదామన్నది నంబాళ్ల అభిప్రాయం కాదని అభయ్ స్పష్టం చేశారు.

 
నాడు చెప్పకుండా నేడు విమర్శలా?ప్రపంచీకరణ కారణంగా దేశ కాల పరిస్థితులలో వచ్చిన మార్పుల గురించి కేంద్ర కమిటీ 2021లోనే చర్చించి 'భారత దేశంలో ఉత్పత్తి సంబంధాలలో మార్పులు- మన రాజకీయ కార్యక్రమం' దస్తావేజును రూపొందించిందని ఈ దస్తావేజుతో మల్లోజుల, ఆశన్న నాడు విభేదం వ్యక్తం చేయకుండా ఇప్పుడు తమ అభిప్రాయాలను దస్తావేజుకు భిన్నంగా బహిరంగంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నిజానికి వారు దేశ పరిస్థితులను అధ్యయనం చేసి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ఉంటే పార్టీకి ఉపయోగపడేది. పార్టీలో అంతర్గత చర్చ కొనసాగించి ఉంటే ఆరోగ్యకరంగా ఉండేది. కానీ తామున్న బాధ్యతాయుత స్థానాలను, కేడర్ లలో రాజకీయ అధ్యయనంలో ఉన్న బలహీన తలను వినియోగించుకుని కేడర్ ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కొందరు ఎస్‍జడ్‍సీ సభ్యులు కూడా ఈ తప్పుడు సూత్రీకరణలను ఆమోదించి వీరితో కలిసి లొంగిపోవడం వారిలో అధ్యయన లేమిని తెలియజేస్తోందని విమర్శించారు.
 

*దేశ కాల పరిస్థితులలో మార్పుల గురించి చర్చించిన కేంద్ర కమిటీ 2021లో 'భారత దేశంలో ఉత్పత్తి సంబంధాలలో మార్పులు-మన రాజకీయ కార్యక్రమం' దస్తావేజును రూపొందించింది. దేశంలో భూస్వామ్యం ఒక మేరకు బలహీనపడినప్పటికీ, ఇప్పటికీ భూస్వామ్యమే ప్రధాన వైరుధ్యంగా ఉన్నదని స్పష్టం చేసింది. అలాగే పెట్టుబడిదారీ సంబంధాలలో గతంతో పోల్చుకున్నప్పుడు కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, మెజారిటీ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, భూమి సమస్య మౌలికమైనదని, కాబట్టి దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథాను కొనసాగించాలని వివరించింది. దేశంలో గడచిన దశాబ్దాలలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కారణంగా వచ్చిన మార్పులను వివరంగా చర్చించి, ఎత్తుగడలలో మార్పులను రూపొందించింది. ఆయా ప్రాంతాలలో నిర్దిష్ట పరిస్థితులను బట్టి ఎత్తుగడలు ఎక్కడికక్కడ చేపట్టాలన్న మార్గదర్శకత్వం అందించింది. ఈ దస్తావేజుపై వచ్చిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. ఈ దస్తావేజుతో సోను కానీ సతీష్ కానీ విభేదం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు తమ అభిప్రాయాలను దస్తావేజుకు భిన్నంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు. 

నిజానికి దేశ పరిస్థితులను అధ్యయనం చేసి వారు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ఉంటే పార్టీకి ఉపయోగపడేది. పార్టీలో అంతర్గత చర్చ కొనసాగించి ఉంటే ఆరోగ్యకరంగా ఉండేది. కానీ, వారు తామున్న బాధ్యతాయుత స్థానాలను, కేడర్ లలో రాజకీయ అధ్యయనంలో ఉన్న బలహీనతను వినియోగించుకుని కేడర్ లను తప్పు దోవ పట్టించారు. బాధ్యతా రహితంగా వ్యవహరించి కర్తవ్యాలను ఉల్లంఘించారు.కొందరు ఎస్ జడ్ సీ సభ్యులు కూడా ఈ తప్పుడు సూత్రీకరణలను ఆమోదించి వారితో కలిసి లొంగిపోవడం వారిలో అధ్యయన లేమిని తెలియజేస్తుంది.భారత దేశంలో కానీ మరే దేశంలో కానీ విప్లవోద్యమంలో ఉద్యమం పురోగమిస్తున్నందుకే దోపిడీ పాలక వర్గాలు నిర్బంధ క్యాంపెయిన్ లు చేపడతాయి. ఈ క్రమంలో విప్లవోద్యమం ఆటుపోట్లకు, ఎగుడు దిగుడులకు, మలుపులు మెలికలకు గురి అవుతుంది. కేడర్ లలో పారుబోతుతనం వస్తుంది. ప్రజలలో బలహీనుల నుంచి రాజ్యానికి ఉపయోగపడే శక్తులు తయారవుతాయి. తీవ్రమైన నష్టాలు ఎదురవుతాయి. అయితే వీటి వల్ల పార్టీలు వ్యూహం మార్చుకోవు.వ్యూహం దేశ కాల పరిస్థితులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.సోను, సతీష్ లు మారిన పరిస్థితులంటున్న విషయానికి వివరణ ఇవ్వాలి. పైపై మాటలు రాజకీయ చర్చ కాదు. వారి అవగాహన, ద్రోహం ప్రాణ భయంతో వచ్చినవే తప్ప మరేమీ కాదు.పార్టీ ఎన్నడూ తన లోపాలను, పొరపాట్లను కప్పి పుచ్చుకోదు, కప్పి పుచ్చుకోలేదు.

పార్టీ, ప్రజా సైన్యం, ఐక్య సంఘటన అనే మూడు అద్భుత ఆయుధాలతో భారత కార్మికవర్గ అగ్రగామిగా విప్లవోద్యమానికి మార్గదర్శకత్వం వహించడంలో జరిగిన పొరపాట్లను కాంగ్రెస్ అనంతర 14 సంవత్సరాల కార్యాచరణను సంశ్లేషించి, విశ్లేషించిన కేంద్ర కమిటీ 2020లో రూపొందించిన కేంద్ర రాజకీయ నిర్మాణ సమీక్షలో పేర్కొంది.వివిధ సర్కులర్ లలో పేర్కొంది. వీటి గురించి పార్టీలో సభ్యుల వద్ద నుంచి పై స్థాయి కమిటీల వరకు ఎవరికైనా చర్చించే హక్కు, మార్పులు, చేర్పులు చేసే హక్కు ఉంటుంది. పార్టీ నిబంధనావళిని అనుసరించి ఈ రకమైన చర్చ చేయడం బాధ్యత గల కార్యకర్తలు చేయవలసిన పని. సోను, సతీష్ లు ఒక మేరకు ఈ చర్చ చేసి ఉండవచ్చు. కానీ దస్తావేజుతో తమకు భిన్నాభిప్రాయం ఉన్నదని అనలేదు.ఇప్పుడు 'కేంద్ర కమిటీ అన్నీ తప్పులే చేసిందం 'టూ సోను ప్రజలకు క్షమాపణలు చెప్పడం, 'ఇక పార్టీ ఏం చేయలేదు, అందరం చచ్చిపోతాం, లేదా సరెండర్ చేయించుకుంటాడం'టూ సతీష్ ఏప్రిల్ నాటి నుంచి మాట్లాడడం ఒక కొసకు వెళ్లి ఆలోచించడం. వారు ఇంతకాలం నమ్మిన మార్క్సిస్టు తత్వశాస్త్ర గతితార్కిక నియమానికి విరుద్ధం. నిజమైన కమ్యూనిస్టులు గతితార్కిక భౌతికవాద దృష్టితో చూస్తారు. అప్పుడే ప్రతి అంశంలోను ఉన్న పాజిటివ్, నెగిటివ్ అంశాలు అర్థం చేసుకోగలుగుతారు. అనుకూలతలు ఉన్న కాలంలో రాబోయే ప్రతికూలతలను అంచనా కడతారు, అలాగే ప్రతికూలతలలో అనుకూలతలను చూడగలుగుతారు. ఇలా చేయకపోతే పెడధోరణి పట్టి, ఒక కొసకు వెళ్లిపోతారు. సోను, సతీష్ లు చేసినదిదే. పరిస్థితులకు తగిన విధంగా తమ్ము తాము ఎదిగించుకోకపోవడం వల్లనే సోను, సతీష్ లు పెడతోవ పట్టారు. వారిలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణపర, వ్యవహారపర లోపాలను పై, తమ, కింది స్థాయి కమిటీల నుంచి వస్తున్న విమర్శలను స్వీకరించి, సరిదిద్దుకోవాలన్న నిజాయితీ కొరవడడంతో నేడు ఈ స్థితికి చేరుకున్నారని అభయ్‌ విమర్శించారు.
 
. ప్రాణాలు అర్పించాలన్న అంకిత భావంతో విప్లవంలోకి వచ్చిన వారు చివరి వరకు కొనసాగుతారని అలా కాకుండా విప్లవవానికి ద్రోహం తలపెట్టాలని కుటిల బుద్ధితో ఉన్నవారు విప్ల సిద్ధాంతంపై, రాజకీయ పంథాపై పార్టీపై తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను, కేడర్ ను గందరగోళానికి గురి చేస్తారని పేర్కొన్నారు. తెలిసీ తెలియకుండా తప్పుదోవ పట్టిన వారు సరైన పద్ధితిలో ఆలోచిస్తే ఎప్పటికైనా తిరిగి విప్లవం పక్షం వస్తారని, వర్గ రాజకీయాలను గుర్తించిన విప్లవ కేడర్ లు ప్రజలు ఈ అవకాశవాదుల మూర్ఖపు మాటలు నమ్మరని పేర్కొన్నారు. దేశంలో మావోయిస్టు పార్టీ సమసమాజ స్థాపనతో అంతిమంగా విజయం సాధించే దిశగా ప్రయాణం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

దేశంలో పీడిత ప్రజలు, సమూహాలు, ప్రజాస్వామికవాదులు, ప్రగతి కాముకులు, పాత్రికేయులు, ప్రజలూ అందరూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ తమ వంతు కర్తవ్యంగా విప్లవంలో భాగస్వాములుగా కొనసాగుతారని ఆశిస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దేశంలో వ్యవసాయ విప్లవం ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పరిపూర్తి చేసి, ప్రజల రాజ్యాధికారం సాధించి, సమసమాజ స్థాపన దిశగా అంతిమంగా కమ్యూనిజం సాధించే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నామని అభయ్‌ స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు