/rtv/media/media_library/vi/WchIUJftjDc/hqdefault.jpg)
ayyappa makara jyothi 2026
Makara Jyothi 2026: అయ్యప్ప మాలదారులు ఎంతో పవిత్రంగా భావించే మకరజ్యోతి దర్శనం ఈ రోజు కానున్నది. దీంతో లక్షలాదిగా శబరికి చేరుకున్న భక్తులతో శబరికొండలు కిటకిటలాడుతున్నాయి. పాదయాత్రగా శబరికి చేరుకుంటున్న భక్తులు అయ్యప్ప నామస్మరణతో పంచగిరులు మార్మోగుతున్నాయి. మకర జ్యోతి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. అలాంటి జ్యోతి 2026 ఏడాది జనవరి 14న అనగా బుధవారం భక్తులకు దర్శనం ఇవ్వనుంది.ఇప్పటికే మకరవిలక్కు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) అరుణ్ ఎస్ నాయర్ తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా బారికేడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల పనులు కూడా పూర్తి అయ్యాయి.
సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రమణ ఘడియ మధ్యాహ్నం 3:13 PM కు జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం, సుమారు 6:30 PM నుండి 6:55 PM మధ్య శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నంబలమేడు పర్వతంపై దివ్యమైన మకర జ్యోతి మూడు సార్లు భక్తులకు దర్శనమిస్తుంది.ఈ మకర జ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి వారి దైవిక ఉనికికి సంకేతంగా భక్తులు విశ్వసిస్తారు. అయితే పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన తర్వాత ఈ రోజే మకర జ్యోతి రూపంలో జ్యోతిర్మయుడై భక్తులకు అభయమిచ్చారని చెబుతారు.
41 రోజుల పాటు కఠినమైన మాలధారణ దీక్షను పాటించే భక్తులకు, ఈ జ్యోతి దర్శనం వారి దీక్షా ఫలాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం.ప్రతీ ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడుపై మకరజ్యోతిని వెలిగిస్తారు. మకర జ్యోతికి, మకర విళక్కుకు మధ్య చిన్న వ్యత్యాసం ఉంది. ఆకాశంలో కనిపించే నక్షత్రాన్ని ‘మకర జ్యోతి’ అని, పొన్నంబలమేడు కొండపై వెలిగే దీపాన్ని ‘మకర విళక్కు’ అని పిలుస్తారు. పూర్వం గిరిజనులు అక్కడ చేసే ఈ జ్యోతి వెలిగించే సంప్రదాయం ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ దివ్య వెలుగును చూడటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మాలధారణ, ఇరుముడితో శబరిమలకు చేరకుంటారు.
కాగా గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు, ఉత్సవాల రద్దీని నియంత్రించేందుకు దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై అధికారులు కఠినమైన పరిమితులను విధించారు. భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. భక్తుల భద్రత కోసం శబరిమల మార్గాల్లో, సన్నిధానం వద్ద అదనపు పోలీసు బలగాలను, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. మకరవిలక్కు(మకరజ్యోతి) పర్వదినం సందర్భంగా భక్తుల సంఖ్యను అధికారులు క్రమబద్ధీకరించారు. జనవరి 13న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈరోజు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మంది భక్తులకు పరిమితం చేశారు. ఇక జనవరి 15 నుండి 18 వరకు ప్రతిరోజూ 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించనున్నారు. జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30,000కు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అయితే మకర జ్యోతి దర్శనానికి ముందు పందళ రాజవంశీకులు పంపే ‘తిరువాభరణాలు’ సన్నిధానానికి చేరుకుంటాయి. పందళం ప్యాలెస్ నుండి 12న ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు జనవరి 14న సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ ఆభరణాల పెట్టెలు మూడు రోజుల పాటు భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా శబరిమలకు వస్తాయి. ఈ ఆభరణాలను స్వామివారికి అలంకరించిన తదుపరి జరిగే మహా హారతి సమయంలోనే ఆకాశంలో మకర జ్యోతి వెలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటల నుండి నిలక్కల్-పంబ మార్గంలో, ఉదయం 11 గంటల నుండి పంబ -సన్నిధానం మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. అలాగే జనవరి 12 ఉదయం నుండి జనవరి 15 మధ్యాహ్నం వరకు హిల్ టాప్ వద్ద ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు. దీంతో భక్తులు తమ వాహనాలను నిలక్కల్ వద్దే పార్క్ చేయాల్సి ఉంటుంది. ఎరుమేలి అటవీ మార్గంలో కూడా జనవరి 13 సాయంత్రం రాకపోకలపై ఆంక్షలు విధించారు.
Follow Us