/rtv/media/media_files/2025/12/29/ishita-sengar-2025-12-29-19-26-17.jpg)
ఢిల్లీ హైకోర్టు ఉన్నావ్ అత్యాచారం కేసులో ఇచ్చిన తీర్పుతో మరో సారి ఈ సంచలన కేసు వార్తలోకి వచ్చింది. దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కుమార్తె ఇషితా సెంగార్ రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ హైకోర్టు ఆమె తండ్రికి మంజూరు చేసిన బెయిల్‌పై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఈ లేఖను పోస్ట్ చేశారు.
ఆ లేఖలో కుల్దీప్ సింగ్ సెంగార్ కుమార్తె ఇషితా న్యాయంపై ఆమెకున్న నమ్మకం తగ్గుతుందన్నారు. భయంతో, నిస్సహాయతతో న్యాయవ్యవస్థపై నెమ్మదిగా నమ్మకం కోల్పోతున్న ఓ కుమార్తెగా ఈ లేఖ రాస్తున్నాను" అని ఇషితా పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్లుగా తమ కుటుంబం మౌనంగా చట్టాన్ని గౌరవిస్తూ న్యాయం కోసం వేచి చూస్తోందని, కానీ తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన తండ్రిపై ఉన్న నేరారోపణల కారణంగా తమ కుటుంబాన్ని సమాజం చూస్తున్న విధానంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమెను రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఆమె వెల్లడించారు. తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉన్నప్పటికీ, ప్రపంచం తనను కేవలం 'ఒక రేపిస్ట్ కూతురు'గా మాత్రమే ముద్ర వేసిందని, ఇది తనను మానసికంగా కృంగదీస్తోందని తెలిపారు.
రాజకీయ బలం ఉండి కూడా తాము ఎక్కడా ధర్నాలు చేయలేదని, టీవీ చర్చల్లో పాల్గొని రచ్చ చేయలేదని ఆమె గుర్తు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న నమ్మకంతోనే నిశ్శబ్దంగా ఉన్నామని, అయితే ఆ నిశ్శబ్దాన్ని సమాజం ఓటమిగా భావిస్తోందని ఆమె లేఖలో రాశారు. ఈ వివాదం అంతా కుల్దీప్ సెంగార్ బెయిల్ చుట్టూ తిరుగుతోంది. 2025 డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు ఆయన శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే, సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, డిసెంబర్ 29న ఆ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. దీనివల్ల ఆయన జైలులోనే కొనసాగాల్సి ఉంటుంది. కేవలం ప్రజాగ్రహం లేదా సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్‌ల ఆధారంగా కాకుండా, సాక్ష్యాధారాల ప్రాతిపదికన న్యాయం జరగాలని ఆమె కోరారు. సానుభూతిని అడగడం లేదని, కేవలం మా వైపు ఉన్న వాస్తవాలను కూడా వినాలని ఇషితా సెంగార్ లేఖలో కోరారు.
మరోవైపు, బాధితురాలి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సమర్థించారు. దోషికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు వాదిస్తున్నారు.
Follow Us