Sabarimala: ఆలయాధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం.. వందలాది భక్తుల ప్రాణాలకు ప్రమాదం!

శబరిమలలో నెలకొన్న భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ జరగరానిది జరిగితే ఏం చేస్తారంటూ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డుపై ధ్వజమెత్తింది. ఆలయం తెరిచిన 48 గంట్లోనే సుమారు 2 లక్షల మంది శబరిమలకు చేరుకున్నారు.

New Update
shabarimala

శబరిమలలో నెలకొన్న భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ జరగరానిది జరిగితే ఏం చేస్తారంటూ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డుపై ధ్వజమెత్తింది. పవిత్ర వృశ్చిక మాసంలో మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఆలయ ప్రాంతంలో అస్తవ్యస్త వాతావరణం, తొక్కిసలాట లాంటి పరిస్థితులు నెలకొనడంపై ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని కోర్టు స్పష్టం చేసింది. జరగరాంది ఏదైనా జరిగితే వందల మంది భక్తుల ప్రాణాలకు ప్రమాదమని హైకోర్టు మందలించింది.

ఆలయం తెరిచిన 48 గంట్లోనే సుమారు 2 లక్షల మంది శబరిమలకు చేరుకున్నారు. వాళ్లలో పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా భక్తులు రావడంతో రద్దీపై నియంత్రణ కోల్పోయినట్లైంది. భక్తులను అలా హడావిడిగా లోపలికి, బయటకు పంపడమేంటి?.. కేవలం ఒక్క నిమిషంలో 80 మందిని దర్శనానికి అనుమతించాల్సిన అవసరం ఏంటి?.  రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయలేకపోతే విపత్తు తప్పదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

"ఒకవేళ పరిస్థితిని నియంత్రించకపోతే విపత్తు సంభవించడం అనివార్యం" అని హెచ్చరించింది. యాత్రా సీజన్‌కు అవసరమైన మౌలిక వసతుల పనులు కనీసం ఆరు నెలల ముందు ఎందుకు పూర్తి చేయలేదని TDBని హైకోర్టు నిలదీసింది. భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్నప్పటికీ వర్చువల్ క్యూ స్లాట్‌ల సంఖ్యను తగ్గించకపోవడంపై కూడా ప్రశ్నలు సంధించింది. రద్దీని అదుపులోకి తీసుకురావడానికి హైకోర్టు తక్షణమే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. 

 స్పాట్ బుకింగ్‌లపై పరిమితి: తాత్కాలికంగా రోజువారీ స్పాట్ బుకింగ్‌ల సంఖ్యను 5,000కు పరిమితం చేయాలని ఆదేశించింది.
శాస్త్రీయ విధానం: రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ పద్ధతులు పాటించాలి. ఆలయ ప్రాంతం ఎంత మంది భక్తులను సురక్షితంగా నిర్వహించగలదో లెక్కించి, దానికి అనుగుణంగానే భక్తులను అనుమతించాలని స్పష్టం చేసింది.
సెక్యూరిటీ విభజన: రద్దీని తగ్గించడానికి మార్గాన్ని వివిధ సెక్యూరిటీ విభాగాలుగా విభజించి, ఒక విభాగం నిండగానే తరువాతి విభాగానికి అనుమతించాలని సూచించింది.
కనీస వసతులు: క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండే భక్తులకు త్రాగునీరు, ఆహారం అందించేలా TDB చర్యలు తీసుకోవాలి.

ఈ ఆదేశాలపై శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని కోర్టు TDB, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పింది.

Advertisment
తాజా కథనాలు