CM Siddaramaiah: ముడా స్కామ్ కేసుతో ఇరుకున పడ్డ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన పాదాలకు ఉన్న షూలను ఓ కాంగ్రెస్ కార్యకర్త జాతీయ జెండా చేతిలో పట్టుకొని తొలిగించడం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో దుమారం లేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సామజిక మాధ్యమాల్లో కర్ణాటక బీజేపీ పోస్ట్ చేసింది.
కర్ణాటక బీజేపీ ట్విట్టర్ (X)లో.. "కాంగ్రెస్ పార్టీకి దేశంపై గౌరవం లేదని, జాతీయ జెండాను గౌరవించడం తెలీదు. రాజకీయ జీవితంలో సంధ్యా సమయంలో సీఎం సిద్ధరామయ్య సీటు నిలబెట్టుకోవాలనే ఆరాటంలో ఉన్న ఆయన జాతీయ జెండా పట్టుకుని కూడా మంత్రముగ్ధులయ్యారు." అంటూ విమర్శలు చేసింది. ఇది చూసిన నెటిజన్లు సిద్ధరామయ్యపై విమర్శల దాడికి దిగారు. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి జాతీయ జెండాను గౌరవించడం తెలీదని నిప్పులు చెరుగుతున్నారు. కాగా దీనిపై సీఎం సిద్ధరామయ్య ఇంకా స్పందించక పోవడం గమనార్హం.
ఏం జరిగింది..?
వాస్తవానికి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు సీఎం సిద్ధరామయ్య బుధవారం ఉదయం కర్ణాటకలోని గాంధీభవన్‌కు చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న ఒక కార్యకర్త తన బూట్లు తీయడంలో సిద్ధరామయ్యకు సహాయం చేస్తున్నాడు. ఇంతలో, కార్మికుడి చేతిలో త్రివర్ణ పతాకం ఉంది. అది నేలను తాకుతోంది. దీనికి సంబంధించిన వీడియోను కర్ణాటక బీజేపీ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టడంతో సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు.