ISRO ఖాతాలో మరో విజయం.. గగన్‌యాన్ పారాచూట్‌ టెస్ట్ సక్సెస్

ఇస్రో 'గగన్‌యాన్' మిషన్ దిశగా మరో కీలక విజయాన్ని అందుకుంది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే 'క్రూ మాడ్యూల్' వేగాన్ని తగ్గించి, దానిని సురక్షితంగా ల్యాండ్ చేసే డ్రోగ్ పారాచూట్‌ల క్వాలిఫికేషన్ టెస్ట్‌ ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది.

New Update
parachute

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మక 'గగన్‌యాన్' మిషన్ దిశగా మరో కీలక విజయాన్ని అందుకుంది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే 'క్రూ మాడ్యూల్' వేగాన్ని తగ్గించి, దానిని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు ఉద్దేశించిన డ్రోగ్ పారాచూట్‌ల క్వాలిఫికేషన్ టెస్ట్‌లను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. చండీగఢ్‌లోని డీఆర్‌డీఓ (DRDO)కు చెందిన టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL)లో ఈ నెల డిసెంబర్ 18, 19 తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి. రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ సదుపాయంతో పారాచూట్‌ల సామర్థ్యాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. గగన్‌యాన్ మిషన్‌లో మొత్తం 4 రకాల 10 పారాచూట్‌లు ఉంటాయి. ఈ టెస్ట్ డ్రోగ్ పారాచూట్‌ల పనితనాన్ని నిరూపించాయి.

గగన్‌యాన్ మిషన్‌లో క్రూ మాడ్యూల్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు అది అత్యంత వేగంతో ఉంటుంది. ఆ వేగాన్ని దశలవారీగా తగ్గించడానికి ఈ పారాచూట్ వ్యవస్థ పని చేస్తుంది. ముందుగా రెండు పారాచూట్‌లు తెరుచుకుని మాడ్యూల్ రక్షణ కవచాన్ని తొలగిస్తాయి. అనంతరం రెండు డ్రోగ్ పారాచూట్‌లు విచ్చుకుని మాడ్యూల్ వేగాన్ని తగ్గిస్తాయి. చివరిగా మూడు మెయిన్ పారాచూట్‌లు తెరుచుకుని మాడ్యూల్‌ను క్షేమంగా సముద్రంలో ల్యాండ్ చేస్తాయి.

వివిధ రకాల వాతావరణ పరిస్థితులు, వేగాల్లో ఈ డ్రోగ్ పారాచూట్‌లు ఎలా స్పందిస్తాయో ఈ పరీక్షల్లో నిరూపితమైంది. "అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ పారాచూట్‌లు అద్భుతంగా పనిచేశాయని, నిర్దేశించిన లక్ష్యాలన్నీ నెరవేరాయని" ఇస్రో ప్రకటించింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, డీఆర్‌డీఓ ల్యాబ్‌ల సంయుక్త కృషితో ఈ ప్రయోగం సాధ్యమైంది. భారతదేశం తన మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో, వ్యోమగాముల భద్రతకు సంబంధించి ఈ పరీక్ష విజయం ఒక మైలురాయిగా నిలిచింది. 2026లో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక మిషన్ దిశగా భారత్ మరో అడుగు ముందుకు వేసింది.

Advertisment
తాజా కథనాలు