/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t071113601-2025-12-04-07-11-50.jpg)
IndiGo flights cancelled across the country
IndiGo: పలు సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణ పరిస్థుతుల మూలంగా దేశవ్యాప్తంగా బుధవారం విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో.. 100కు పైగా విమానాలను రద్దు చేయడం గమనార్హం. ఒక్క శంషాబాద్ నుంచే 40 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన చాలామంది ప్రయాణీకులు రైళ్ల కోసం పరుగులు తీశారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కొచ్చిన్ విమానాన్ని రద్దు చేయడంతో అయ్యప్ప భక్తులు బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భద్రతాధికారులు జోక్యం చేసుకుని రీషెడ్యూల్ చేసిన సర్వీసుల్లో వారు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు పంపిస్తామని సర్ధి చెప్పడంతో ప్రయాణికులు శాంతించారు.
అయితే ఈ ప్రభావం మరో 48 గంటల పాటు ఉండే అవకాశం ఉందని విమానయాన సంస్థ తెలిపింది. దీనివల్ల ఈ రోజు కూడా విమాన సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలుస్తోంది. గురువారం కూడా శంషాబాద్ నుంచి 36 విమానాలు రద్దు చేసినట్లు ఇప్పిటికే ఇండిగో సంస్థ ప్రకటించింది. పైలట్ల విధుల నియంత్రణపై ఇటీవల డీజీసీఏ విధించిన నిబంధనలతోపాటు రాత్రి విమానాల ల్యాండింగ్‌ను తగ్గించడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్లు ఇండిగో విమానయాన సంస్థ తెలిపింది.
అయితే ‘స్వల్ప సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరిగిన రద్దీ, సిబ్బంది రోస్టర్ నిబంధనల అప్‌గ్రేడ్‌తో తలెత్తిన ఇబ్బందులూ కారణమే’ విమాన సర్వీసుల రద్దు అని ఇండిగో సంస్థ తెలిపింది. వనరుల వినియోగంలో ప్రణాళికాలోపం వల్లే ఇండిగో విమాన సేవలకు అంతరాయం కలిగిందని ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్‌పీఏ) వివరించింది. సిబ్బంది సమస్య దీనికి ప్రధాన కారణమని తెలిపింది. పైలట్ల విధుల నియంత్రణపై ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీసుకొచ్చిన విమాన విధుల సమయ పరిమితి (ఎఫ్‌డీటీఎల్) వల్ల పైలట్ల కొరత ఏర్పడుతోందని ఏఎల్‌పీఏ అభిప్రాయపడింది. ఇండిగో విమానాల రద్దుపై విచారణ జరుపుతున్నామని, దీనిపై ఆ సంస్థకు నోటీసులిచ్చామని డీజీసీఏ ప్రకటించడం గమనార్హం.
Follow Us