BSFలో దేశీ జాగిలాల విన్యాసాలు.. ఇవి కరిచే కుక్కలు కావు.. కాపాడేవి!

గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్‌ నిర్వహించారు. ఈ వేడుకలో ప్రధాని మోదీ పాల్గొని స్వదేశీ జగిలాల విన్యాసాలను వీక్షించారు. మొదటి సారిగా ఆర్మీలో సేవలు అందిస్తున్న ఇండియన్ బ్రీడ్ డాగ్స్‌ పరేడ్‌లో పాల్గొన్నాయి.

New Update
Indian dog breeds

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్‌ నిర్వహించారు. ఈ వేడుకలో ప్రధాని మోదీ పాల్గొని స్వదేశీ జగిలాల విన్యాసాలను వీక్షించారు. మొదటి సారిగా ఆర్మీలో సేవలు అందిస్తున్న ఇండియన్ బ్రీడ్ డాగ్స్‌ పరేడ్‌లో పాల్గొన్నాయి. ఈ జాగిలాలు అద్భుత ప్రదర్శన ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విదేశీ జాతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ జాతుల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా BSF తీసుకున్న ఈ చర్య ప్రధాని మోదీ 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికతకు ప్రతీకగా నిలిచింది.

ముధోల్, రాంపూర్ హౌండ్‌ల ప్రత్యేకత:
బీఎస్ఎఫ్ తరపున ఈ పరేడ్‌లో ముఖ్యంగా ముధోల్ హౌండ్, రాంపూర్ హౌండ్ జాతి శునకాలు పాల్గొన్నాయి. ఈ జాతులు యాక్టీవ్‌గా ఉంటాయి. అంతేకాదు ఆ కుక్కలను ఓర్పు, భారతదేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితులకు త్వరగా అలవాటుపడే గుణాలు ఉన్నాయి. దీంతో ఇవి భద్రతా బలగాలకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి.

'రియా' నేతృత్వం: చరిత్ర సృష్టించిన శునకం:
ఈ ఇండియన్ బ్రీడ్ డాగ్ ఫోర్స్‌కు 'రియా' అనే ముధోల్ హౌండ్ నాయకత్వం వహించింది. రియా గత సంవత్సరం లక్నోలో జరిగిన అఖిల భారత పోలీస్ డాగ్ మీట్‌లో 116 విదేశీ జాతుల శునకాలను వెనక్కి నెట్టి 'బెస్ట్ డాగ్ ఆఫ్ ది మీట్' టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ పరేడ్‌లో జాగిలాలు పరేడ్ చేశాయి. అలాగే ఎత్తు గోడలు ఎక్కడం, చొరబాటుదారులను పట్టుకోవడం వంటి వ్యూహాత్మక స్కిల్స్ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాయి.


ప్రధాని మోదీ 2020లో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో దేశీయ శునకాలను దత్తత తీసుకోవాలని, భద్రతా దళాలలో వాటిని వినియోగించాలని పిలుపునిచ్చారు. దీనికి స్పందించి, బీఎస్ఎఫ్ ఇప్పటివరకు 150కి పైగా స్వదేశీ శునకాలను శిక్షణ ఇచ్చి, థార్ ఎడారి నుండి తవాంగ్ వరకు వివిధ సరిహద్దు, అంతర్గత భద్రతా ఆపరేషన్లలో మోహరించింది. దేశీయ జాతులైన ఈ శ్వానాలు తమ అద్భుతమైన పనితీరుతో భద్రతా దళాల సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ వేదికపై ఈ దేశీ శునకాల కవాతు భారతదేశం ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని ప్రస్ఫుటం చేసింది.

Advertisment
తాజా కథనాలు