/rtv/media/media_files/2026/01/09/fotojet-16-2026-01-09-21-04-50.jpg)
63 Naxalites surrender
Maoists Surrender : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు, పోలీసుల వ్యూహాలకు ఆకర్షితులైన 63 మంది నక్సలైట్లు దంతేవాడ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా దంతేవాడ పోలీసు సూపరింటెండెంట్ (SP) గౌరవ్ రాయ్ సమక్షంలో తమ ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో కీలక నేతలు ఉండటం గమనార్హం. మొత్తం 63 మందిలో 36 మందిపై ప్రభుత్వం గతంలో భారీ రివార్డులను ప్రకటించింది. వీరిపై ఉన్న మొత్తం రివార్డు విలువ సుమారు రూ. 1.19 కోట్లు ఉంటుందని పోలీసులు ధ్రువీకరించారు. మిగిలిన వారు పార్టీలో వివిధ విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం.
దంతెవాడ జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) కార్యాలయంలో ఈ లొంగుబాటు కార్యక్రమం జరిగింది. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసేలా మావోయిస్టులను ప్రోత్సహించేందుకు దంతెవాడ పోలీసులు చేపట్టిన ‘పున మర్గం’ (పునరావాసం - పునరుజ్జీవనం) ప్రచారమే ఈ భారీ లొంగుబాటుకు కారణమని అధికారులు వెల్లడించారు. డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్ బలగాలు వీరిని లొంగిపోయేలా చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
లొంగిపోయిన వారిలో దర్భా డివిజన్, దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్, మాడ్ డివిజన్‌లతో పాటు ఒడిశాలో పనిచేసిన వారు కూడా ఉన్నారు. వీరిలో డివిజనల్ కమిటీ సభ్యులు (డీవీసీఎమ్) మోహన్ కడ్తీ, సుమిత్రా కడ్తీ, పీపుల్స్ పార్టీ కమిటీ సభ్యురాలు (పీపీసీఎమ్) హంగీ వంటి కీలక నేతలు ఉన్నారు. వీరిపై గతంలో అనేక దాడులు, హత్యలు, ఐఈడీ పేలుళ్లు, ఆస్తుల ధ్వంసం వంటి కేసులు నమోదై ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నక్సల్ పునరావాస విధానం ప్రకారం, లొంగిపోయిన వారికి రూ. 50వేల తక్షణ సహాయంతో పాటు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ, వ్యవసాయ భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు వివరించారు. ఈ లొంగుబాటు బస్తర్‌ను నక్సల్ రహిత ప్రాంతంగా మార్చే ప్రయత్నాల్లో ఒక పెద్ద విజయమని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పట్టిలింగం పేర్కొన్నారు
Follow Us