బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పారాదీప్‌కు ఆగ్నేయంగా 700 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి దక్షిణ - ఆగ్నేయంగా 750 కిలోమీటర్లు, ఖేపుపరా కు ఆగ్నేయంగా 730 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24వ తేదీకి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీ రాత్రి లేదా 25వ తేదీ ఉదయం పూరీ , సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వాతావరణశాఖ హెచ్చరిక
తుఫాను తీరం దాటే సమయంలో ఆ ప్రాంతంలో గంటకు పది నుంచి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి. మత్య్సకారులు వేటకు వెళ్లారాదని వాతవారణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే చేపలు వేటకు వెళ్లిన మత్య్సకారులు తీరానికి చేరుకోవాలని సూచించింది. అలాగే రాష్ట్రంలో అన్ని పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తరాంద్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: అమ్మాయిలను ముక్కలుగా నరికి.. రక్తం తాగి, వండుకోని తిని..!
వాయుగుండం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కృష్ణా, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు కట్టలు తెంచుకుని ఊళ్లను ముంచెత్తుతున్నాయి. అనంతపురంలో కనగానపల్లి చెరువుకట్ట తెగడంతో పండమేరు ఉద్ధృతి పెరిగింది. నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్ - బెంగళూరు హైవేపైకి వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాల మధ్య రవాణా నిలిచిపోయింది. చిత్తూరు జిల్లా తవణంపల్లిలో కురిసిన భారీ వర్షానికి బహుదానదికి వరద పోటెత్తింది. తొడతర సమీపంలో బహుదానదిపై వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. 5 గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాత్కాలికంగా రాకపోకలు సాగించేందుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. దీంతో డైవర్షన్ రోడ్డుపై టిప్పర్ లారీ, ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో కురుస్తోన్న వర్షాలకు తోటమూల - వినగడప మధ్యనున్న వంతెనపైకి వరదనీరు చేరింది. అటువైపు వెళ్తున్న టిప్పర్ లారీ వరదనీటిలో చిక్కుకుపోయింది. 20 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవలో విజయవాడలో సంభవించిన వరదలు మిగిల్చిన నష్టం నుంచి తేరుకోకుండానే.. రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also Read: నెవ్వర్ బిఫోర్.. అమరావతిలో అదిరిపోయే డ్రోన్ షో
మరోవైపు... ఇప్పటికే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న (సోమవారం) రాత్రి నుంచి రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అటు కనగానపల్లి చెరువుకు గండి పడటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రామగిరి - ఎన్‌ఎస్ గేట్, ముత్తవకుంట్ల - కనగానపల్లి, తగరకుంట - కనగానపల్లి రహదారులన్నీ బ్లాక్ అయ్యాయి. ప్రసన్నయపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు పండమేరు వాగు పరివాహక ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రాంతాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. పంట నష్టంపై అధికారులతో ఎప్పటికప్పుడు ఆరా తీశారు. పంట నష్టం, పశు నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఉప్పరపల్లి సమీపంలో వరదలో మునిగిన ప్రాంతాలను అధికారులతో కలిసి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు.
వరదల్లో చిక్కుకున్న నాగార్జున
సినీ నటుడు నాగార్జున ఏపీ వరదల్లో చిక్కకున్నారు. నాగార్జున ఓ జ్యూయలరీ షాపు ప్రారంభానికి అనంతపురం వచ్చారు. అయితే మార్గమధ్యంలోనే ఆయనకు అడ్డంకులు ఎదురయ్యాయి. హైదరాబాద్ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి విమానంలో వచ్చిన నాగార్జున అనంతపురం వస్తుండగా వరదల్లో చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన జ్యూయలరీ షాపు యాజమాన్యంతోపాటు ఆయన అనుచరులు అక్కడి నుంచి మరో మార్గంలో అనంతపురానికి జాగ్రత్తగా తీసుకువచ్చారు. దీంతో నాగార్జునకు పెను ప్రమాదం తప్పినట్లైందని ఆయన అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం జ్యూయలరీ షాపు ప్రారంభించి అభిమానులతో కొంత సమయం గడిపారు.