స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకూ నిస్వార్ధంగా దేశానికి సేవలు చేసిన ప్రధాని ఎవరంటే అందరూ టక్కున చెప్పే సమాధానం మన్మోహన్ సింగ్. గొప్ప ఆర్థికవేత్తగా పేరుగాంచిన ఈయన భారత ప్రధానిగా పదేళ్ళపాటూ దేశాన్ని ప్రగతి పథంలో పరుగులుపెట్టించారనండంలో ఎటువంటి సందేహం లేదు. గొప్ప అధికారిగా, ఎంతో గొప్ప మంత్రిగా.. ఇంకెంతో గొప్ప ప్రధాన మంత్రిగా ఆయన దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. ప్రత్యర్ధులు, ప్రతిపక్ష నేతల చేత కూడా శభాష్ అనిపించుకున్న ఘనత మన్మోహన్ సింగ్ ఒక్కరికే దక్కింది. నెహ్రూ దగ్గర నుంచీ మొత్తం కాంగ్రెస్ నేతలందరినీ తీవ్రంగా విమర్శించే ప్రధాని మోదీ సైతం మెచ్చుకునే వ్యక్తి ఈయన ఒక్కరే.
మన్మోహన్ సింగ్ ఒక మౌనముని. తను చేయాలనుకున్న పనిని సైలంట్‌గా చేసుకుని వెళ్ళిపోయే వ్యక్తిత్వం ఆయనది. మాటల ద్వారా కాకుండా చేత ద్వారా తన పనితనాన్ని అందరికీ చూపించి ప్రశంసలు అందుకున్నారు. ఏనాడు తాను ఇంత చేశాను అని చెప్పుకుని ఎరుగరు. అన్నిటికి మించి అత్యంత నిస్వార్థ నాయకుడిగా అందరికీ గుర్తుండిపోతారు.
పనే దైవం..
రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన ఆయనను పట్టుబట్టి ఆర్థిక మంత్రిని చేసినవారు తెలుగు వారైన ప్రధాని పీవీ నరసింహారావు. ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే పెద్ద మలుపు అని చెప్పవచ్చును. పీవీ అండతో ఆర్థిక మంత్రిగా అనేక సంస్కరణలు అమలు చేశారు మన్మోహన్ సింగ్. దాంతో పాటూ విదేశీ సంస్థలకు భారత్ తలుపులు తెరిచింది కూడా ఈయనే. మనం ఇప్పుడు చూస్తున్న సరళ ఆర్థిక విధానాలు పీవీ-మన్మోహన్ చేపట్టిన సంస్కరణల పుణ్యమే. లేదంటే దేశం ఇప్పటికి ప్రపంచంతో పోటీ పడలేక వెనుకపడిపోయి ఉండేది. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకదశలో దేశ అవసరాలకు బంగారు నిల్వలు కుదువపెట్టే పరిస్థితికి దిగజారింది. అలాంటి సమయంలో, దేశాన్ని గట్టెక్కించిన మేధావి మన్మోహన్ సింగ్. ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలవల్లే ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది.
మన్మోహన్ ఆర్ధిక మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే పని మొదలుపెట్టారు. 1991 నాటికి భారతదేశం క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. అంటే ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంతమందిని వినియోగించాలి అన్నవన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ వ్యవస్థనే పర్మిట్ రాజ్ లేదంటే లైసెన్స్ రాజ్ అంటారు. అందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తారు. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ జులై 24, 1991న బడ్జెట్ ప్రవేశపెట్టారు.
పదేళ్లు ప్రధానిగా..
2004 మే 22న ప్రధాని పదవి చేపట్టి పదేళ్లపాటు 21వ శతాబ్దిలో దేశాన్ని ముందుకు నడిపించిన విద్యావేత్త మన్మోహన్ సింగ్. 2014 వరకూ మన్మోహన్ సింగ్ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా...అవిశ్రాంతంగా పని చేసిన ప్రధాని. సహజంగానే తక్కువ మాట్లాడే మన్మోహన్.. పదేళ్లు ప్రధానిగా ఉన్నప్పటికీ అదే పంథాను అనుసరించారు. పార్లమెంటు, బహిరంగ సమావేశాల్లో తప్ప బయట ఎక్కువగా మాట్లాడింది లేదు. అయితే, పదవులకు కక్కుర్తిపడకుండా, అవినీతి మరక లేకుండా జీవితాంతం నిజాయతీగా వ్యవహరించారని మాత్రం చెప్పవచ్చు. కాంగ్రెస్‌లో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత సుదీర్ఘ కాలంపాటు ప్రధానిగా ఉన్నది ఆయనే. ఆ తరువాత కూడా మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్1 నుంచి 2024 ఏప్రిల్3 వరకూ 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఎన్నో పురస్కారాలు వరించాయి.1956లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆడమ్ స్మిత్ ప్రైజ్ అందుకున్నారు. 1987లో పద్మవిభూషణ్ పురస్కారం, 1993లో యూరో మనీ అవార్డు, ఉత్తమ ఆర్థిక మంత్రి అవార్డు, 1993,1994లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా ఆసియా నుంచి ఏషియా మనీ అవార్డు పొందారు. 2017లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు.
Also Read: BIG Breaking: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు...