/rtv/media/media_files/2025/12/25/unnav-rape-case-issue-2025-12-25-18-22-12.jpg)
Unnav rape case issue
2017 జూన్ 4న దేశ చరిత్రలోనే అత్యంత దారుణం జరిగింది. ఉద్యోగం కోసం వెళ్లిన ఓ మైనర్ దళిత బాలికను ఎమ్మెల్యే అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘోరం ఎన్నో మలుపులు తిరిగింది. తొమ్మిదేళ్లుగా బాధితురాలి తరుపున న్యాయం కోసం పోరాటం జరుగుతూనే ఉంది. ఈ తొమ్మిదేళ్లలో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతి చేస్తున్న న్యాయ పోరాటంలో ఆమె ఇద్దరు అత్తలు, తండ్రిని కూడా కోల్పోయింది. నిందితుల హత్యాయత్నంలో చావు అంచుల దాకా వెళ్లినా ఆమె న్యాయపోరాటం ఆగలేదు. ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక నిందితుడైన BJP మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో ఒక తప్పుని కప్పిపుచ్చుకోడానికి మరో తప్పు చేస్తూ.. అలా హత్యల మీద హత్యలు చేసుకుంటూ రావడం అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది.
అసలేం జరిగిందంటే..
2017 ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బాధితురాలు బహిరంగ లేఖ రాసింది. జూన్ 4 న రాత్రి 8 గంటలకు ఉన్నావ్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తన ఇంట్లో ఆమెపై అత్యాచారం చేశాడని తెలిపింది. ఉద్యోగం కోసం వచ్చిన తనపై ఎమ్మెల్యే అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆ తర్వాత జూన్ 11న ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని చెప్పింది. అప్పట్లో ఈ లేఖ సంచలనం రేపింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ తన అధికార, అంగ బలంతో బాధితురాలి కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాకుండా చేశారు. పైగా బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం ప్రారంభించారు. MLA కుల్దీప్ సింగ్, అతని సోదరుడు, ముగ్గురు పోలీసులతో పాటు మరో ఐదుగురు కలిసి బాధితురాలి తండ్రిని నేరస్థుడిగా ఇరికించి అరెస్ట్ చేయించారు. పోలీసుల కస్టడీలోనే బాధితురాలి తండ్రి చనిపోయాడు.
2018లో సీఎం ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నం
నిందితులపై పోలీసులు ఏ చర్య తీసుకోకపోవడంతో బాధితురాలు 2018 ఏప్రిల్ 8న లక్నోలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. 2018 ఏప్రిల్ 9న బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సెంగార్ సోదరుడు అతడిని కొట్టడం వల్లే చనిపోయాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అంశం మీడియా దృష్టిలో పడింది. ప్రజలు, యువత ఆమెకు సపోర్ట్‌గా నిలబడ్డారు. ఈ కేసుపై విచారణ కోసం డిమాండ్ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 13న ఉన్నావ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించారు. దేశవ్యాప్తంగా నిరసనల తర్వాత CBI కుల్దీప్ సింగ్‌ను అరెస్ట్ చేసింది.
బాధితురాలిపై మర్డర్ అటెంప్ట్ (2019)
2019 జూలై 28న బాధితురాలు ప్రయాణిస్తున్న కారును రాయ్‌బరేలీ వద్ద ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ఇద్దరు అత్తలు చనిపోగా, బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ప్రమాదం కాదు, కుల్దీప్ చేయించిన హత్యాయత్నమని తర్వాత పోలీసుల విచారణలో తేలింది. సుప్రీంకోర్టు 2019 ఆగస్టు 1న ఈ కేసును ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీకి బదిలీ చేసింది. బాధితురాలికి, ఆమె కుటుంబానికి CRPF భద్రత కల్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత డిసెంబర్ 16న ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కుల్దీప్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్ 20న ఆయనకు జీవిత ఖైదు, రూ.25 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో కూడా 2020 మార్చిలో ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.
శిక్ష రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు బెయిల్
దాదాపు ఐదేళ్ల జైలు జీవితం తర్వాత కుల్దీప్ సింగ్ ఢీల్లీ హైకోర్టులో తనకు విధించిన శిక్షపై అప్పీల్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణల నిరూపిచేందుకు సరైన ఆధారాలు లేవని, సీబీఐ దర్యాప్తులో లోపాలున్నాయని పేర్కొన్నారు. చివరికి కోర్టు ఆయన జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(c) కింద కల్దీప్‌ను 'పబ్లిక్ సర్వెంట్'గా పరిగణించి గతంలో శిక్ష వేశారని, కానీ సాంకేతికంగా అది సరికాదని ప్రాథమికంగా కోర్టు అభిప్రాయపడింది. ఆయన శిక్షను సస్పెండ్ చేస్తూ 2025 డిసెంబర్ 23న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.15 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశించింది. బాధితురాలి నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లకూడదని.. తన పాస్‌పోర్టును కోర్టులో అప్పగించాలని చెప్పింది. అలాగే ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
‘తీర్పు ఫ్యామిలీకి మరణ శాసనం’
భద్రతా కారణాల దృష్ట్యా ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలు ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో కాకుండా, ఢిల్లీలోని ఓ సురక్షిత ప్రాంతంలో నివసిస్తున్నారు. ప్రభుత్వం ఆమెకు నివాస వసతిని కల్పించింది. ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఆమెతోపాటు బాధితురాలి కుటుంబానికి CRPF దళాలతో నిరంతరం భారీ భద్రత కల్పిస్తున్నారు. 2019లో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఆమె ఊపిరితిత్తులకు, ఎముకలకు తీవ్ర గాయాలయ్యాయి. చాలా కాలం పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందిన తర్వాత ఆమె కోలుకున్నారు, కానీ ఆ ప్రమాద ప్రభావం ఇప్పటికీ ఆమె ఆరోగ్యంపై ఉంది.
ఇప్పటికీ కుల్దీప్ సింగ్, అతడి అనుచరులకు వ్యతిరేకంగా బాధితురాలు కోర్టులో పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా కుల్దీప్‌కు బెయిల్ మంజూరు కావడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ తీర్పుపై బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడికి బెయిల్ రావడం తన కుటుంబానికి "మరణ శాసనం"వంటిదని, తమకు రక్షణ లేదని కన్నీటి పర్యంతమైంది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆమె నిరసన కూడా చేపట్టింది. ఈ బెయిల్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని బాధితురాలు ప్రకటించింది. సీబీఐ కూడా కుల్దీప్ సింగ్ బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ కేసు మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కనుంది.
గుజరాత్ అల్లర్లలో గర్భిణిపై గ్యాంగ్ రేప్
2002లో గుజరాత్ అల్లర్లు జరిగిన సమయంలో బిల్కినో బానో అనే 21 ఏళ్ల గర్భిణిపై 11 మంది వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. 2008లో ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆ 11 మంది నిందితులను దోషులుగా తేలుస్తూ జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం పాత రెమిషన్ (శిక్ష తగ్గింపు) విధానాన్ని వినియోగించి 11 మంది దోషులను జైలు నుంచి విడుదల చేసింది. వాళ్లు జైలు నుంచి బయటకు వచ్చాక మిఠాయిలు తినిపించడం, పూల మాలలతో స్వాగతం పలకడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆ తర్వాత బిల్కినో బానో దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో 2024 జనవరి 8న సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదని.. ఎందుకంటే విచారణ మహారాష్ట్రలో జరిగిందని స్పష్టం చేసింది. ఆ 11 మంది దోషులను రెండు వారాల్లోగా తిరిగి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది.దీంతో జనవరి 21 ఆ 11 మంది దోషులు గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో ఉన్న గోద్రా సబ్ జైలులో లొంగిపోయారు. అప్పటి నుంచి వారు జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు.
ఢిల్లీలో నిర్భయ కేసు
2012, డిసెంబర్ 16న ఢిల్లీలో ఓ 23 ఏళ్ల మెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఇనుప రాడ్లతో ఆమెను గాయపర్చారు. చికిత్స తీసుకుంటూ బాధితురాలు డిసెంబర్ 29న మృతి చెందింది. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో కేంద్రం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులోనే సూసైడ్ చేసుకోగా, మరొకరు మైనర్ కావడంతో విడుదలయ్యారు. మిగిలిన నలుగురు దోషులను మార్చి 20, 2020న ఉరితీశారు.
హైదరాబాద్‌లో దిశ కేసు
2019, నవంబర్ 19న శంషాబాద్ సమీపంలో ఓ వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని షాద్‌నగర్ సమీపంలో ఓ బ్రిడ్జి కింద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటన కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ ఏడాది డిసెంబర్ 16న నిందితులను సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపేశారు. ఈ కేసులో త్వరగా న్యాయం జరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ ఎన్‌కౌంటర్ ఓ బూటకమని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ తన రిపోర్టులో వెల్లడించింది.
Follow Us