/rtv/media/media_files/2025/10/16/maoists-on-the-verge-of-surrender-2025-10-16-15-51-25.jpg)
Maoists on the verge of surrender
MAVOISTS SURRENDER : కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టుల గుండెల్లో గుబులు మొదలైంది. కేంద్రం చర్యలతో 50 ఏళ్ల చరిత్ర ఉన్న మావోయిస్టు పార్టీ కేడర్ కకావికలం అవుతోంది. వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో మిగిలిన నేతలు లొంగుబాట పట్టారు. ఒకరి తర్వాత ఒకరుగా మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. అటు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నార్త్ బస్తర్ డివిజన్ ఇన్‌ఛార్జి రాజ్‌మాన్ కూడా లొంగిపోయారు. ఇప్పుడు అదే బాటలో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం సరెండర్ అయ్యారు. ఆయనతో పాటు మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు.
ఆశన్నతో పాటు మరో 130 మంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. బీజాపూర్ జిల్లాలోని భైరామ్‌గఢ్‌లో పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. 70కి పైగా ఆయుధాలతో భైరామ్‌గఢ్‌కు వెళ్లి వీరంతా లొంగిపోయారు. ఆశన్నతో మరో 130 మంది మావోయిస్టులను బీజాపూర్ పోలీసులు బస్సుల్లో తరలించారు. ఆశన్న అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ములుగు జిల్లాలోని లక్ష్మీదేవిపేట. హన్మకొండలో పాలిటెక్నిక్ చదువుతూ రాడికల్ ఉద్యమాల వైపు ఆకర్షితుడై 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్ గ్రూప్ చేపట్టిన పలు కీలక యాక్షన్లలో ఆశన్న సభ్యుడిగా ఉన్నారు. 1999 సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లోని SR నగర్ చౌరస్తాలో IPS అధికారి ఉమేశ్‌చంద్రను దారికాచి కాల్చి చంపిన ఘటన, ఆ తర్వాత 2000 మార్చి 7న అప్పటి ఉమ్మడి ఏపీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని ఘట్‌కేసర్ దగ్గర బాంబు పేల్చి చంపిన టీమ్‌లోనూ ఆశన్న ఉన్నట్లు చెబుతారు. అంతేకాక 2003 అక్టోబర్‌లో తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద నాటి సీఎం చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని క్లెమోర్ మైన్స్ పేల్చిన తొమ్మిది మంది సభ్యుల బృందానికి ఆశన్నే నాయకత్వం వహించారు.
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని వేర్వేరు జిల్లాల్లో మొత్తం 78 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో 27 మంది లొంగిపోగా, ఇందులో పది మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. కాంకేర్ జిల్లాలో 32 మంది మహిళా మావోయిస్టులతో కలిపి మొత్తంగా 50 మంది అజ్ఞాతం వీడారు. ఇందులో మావోయిస్టు పార్టీలో కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన రాజమన్ మండావి అలియాస్ రాజ్‌మోహన్, రాజు సలామ్ అలియాస్ శివప్రసాద్ కూడా ఉన్నారు. వారి నుంచి ఏడు AK 47లతో పాటు మరో 17 ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు తెలంగాణ పోలీసుల ఎదుట మరో మావోయిస్టు నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు. సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శిగా కొనసాగిన ప్రభాత్.. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో లొంగిపోయారు.
దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడిందనే అభిప్రాయం కలిగించడానికే అగ్రనేతల లొంగుబాటు కార్యక్రమాలను వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ఏపీ, తెలంగాణలో ఉనికి కోల్పోయింది. ఏవోబీ లో వరుస ఎన్‌కౌంటర్లలో చలపతి, గాజర్ల గణేశ్, మోడెం బాలకృష్ణ వంటి కేంద్ర కమిటీ సభ్యులతో పాటు చైతే వంటి మహిళా అగ్రనేతలు చనిపోయారు. ఇక ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుధాకర్, మైలారపు ఆడేళ్లు చనిపోయారు.
2027 మార్చి నాటికి మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఆయుధాలు వదిలిపెట్టాల్సిందేనని, లేదంటే ఎవరినీ వదలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చెప్పినట్టుగానే భద్రతా దళాలు భారీగా కూంబింగ్‌లు నిర్వహిస్తోంది. వరుస పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు ఆయుధాలు వదిలి ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. అగ్ర నేతలు కూడా సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ముగించి.. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.
ఇది కూడా చూడండి: Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్