/rtv/media/media_files/drink-alcohol4.jpeg)
Alcohol
Alcohol: ఆధునిక కాలంలో పార్టీ ఏదైనా మందు ఉండటం సహాజం, స్నేహితులు, బంధువులు, ఫంక్షన్‌లు ఇలా సందర్భం ఏదైనా మందు ఉండాల్సిందే. అయితే వారితో కలిసి సిట్టింగ్ వేసినప్పుడు మనం ఒక విచిత్రాన్ని గమనిస్తూ ఉంటాం. మామూలు సమయంలో సరిగా మాట్లాడని వాడు కూడా, రెండు పెగ్‌లు పడగానే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటాడు. " ఐ లవ్ యూ" నుంచి మొదలుపెట్టి ప్రపంచ రాజకీయాల వరకు అన్నీ ఇంగ్లీష్‌లోనే చర్చిస్తాడు.అలా మాట్లాడితే మందు ఎక్కువైందని మనం వారిని చూసి నవ్వుకుంటాం. కానీ, దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైంటిఫిక్ కారణం ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పరిశోధనలు కూడా చేశారు. 'జర్నల్ ఆఫ్ సైకోఫార్మకాలజీ'లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటే పరాయి భాష మాట్లాడే సామర్థ్యం పెరుగుతుందని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్, మాస్ట్రిక్ట్ యూనివర్సిటీకి చెందిన 50 మంది శాస్త్రవేత్తలు జర్మన్ విద్యార్థులపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.
సాధారణంగా ఏదైనా కొత్త భాషలో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లుతాయేమో, ఎదుటివారు నవ్వుతారేమో అనే భయం చాలామందిలో ఉంటుంది. దీన్ని సైన్స్ భాషలో 'లాంగ్వేజ్ యాంక్జైటీ' అంటారు. మందు తాగినప్పుడు మెదడులోని 'ప్రీ-ఫ్రంటల్ కార్టెక్స్' పనితీరు కాస్త మందగిస్తుంది. మనకు భయం, సిగ్గు, మొహమాటం వంటి భావాలను కలిగించేది ఇదే. ఆల్కహాల్ వల్ల ఈ భయం పోయి, ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా ఇంగ్లీష్ పదాలను వాడటం మొదలుపెడతారట.
ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా మెదడులో 'డోపమైన్' విడుదల అవుతుంది. దీనివల్ల మనిషికి ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. దీన్నే 'లిక్విడ్ కరేజ్' అని పిలుస్తారు. ఈ సమయంలో గ్రామర్ తప్పుల గురించి అస్సలు ఆలోచించరు. కేవలం తాము చెప్పాలనుకున్న విషయం ఎదుటివారికి చేరాలనే దానిపైనే దృష్టి పెడతారు. అందుకే వారి ఇంగ్లీష్ ప్రవాహంలా దూసుకు వస్తుంది.
ఇక్కడ పరిశోధనలో మరో విషయం కూడా తెలిసింది. మందు తీసుకోని వారికంటే, కొద్దిగా తీసుకున్న వారి ఉచ్చారణ స్పష్టంగా ఉన్నట్లు తేలింది. ఆల్కహాల్ వల్ల నాలుక కండరాలు వదులవుతాయి . దీనివల్ల కష్టమైన ఇంగ్లీష్ పదాలను కూడా సులభంగా పలకగలుగుతారు. అయితే ఇది కేవలం పరిమిత మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దీని అర్థం మందు తాగితే ఇంగ్లీష్ పండితులు అయిపోతారని కాదు. మోతాదు మించితే మాట తడబడి, ఉన్న భాష కూడా రాకుండా పోతుంది. మన దగ్గర ఇంగ్లీష్ మాట్లాడటం అనేది ఒక 'స్టేటస్'గా మారింది కాబట్టి, మనసులో దాగి ఉన్న ఆ కోరిక నిషాలో బయటకు వస్తుంది. మందు మనలోని భయాన్ని మాత్రమే పోగొడుతుంది తప్ప కొత్తగా భాషను నేర్పదు. కాబట్టి ఆల్కహాల్‌ను నమ్ముకోవడం కంటే స్వతహాగా ఆత్మవిశ్వాసం పెంచుకోవడం మంచిది.
Follow Us