DK Shivakumar : ఆ ప్రశ్న జ్యోతిష్యుడిని అడగండి..  డీకే శివకుమార్ ఫైర్!

కర్ణాటకలో సీఎం మార్పు, క్యాబినేట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో డిప్యూటీ సీఎం,  రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
dj shivakumar

కర్ణాటకలో సీఎం మార్పు, క్యాబినేట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో డిప్యూటీ సీఎం,  రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక నాయకత్వంలో మార్పులు ఉంటాయా అని విలేకరులు పదే పదే అడగగా, ఆయన ఆ ప్రశ్న జ్యోతిష్యుడిని అడగండి అంటూ ఫైరయ్యారు. 

సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య రెండున్నరేళ్ల సీఎం పదవీ పంపకం ఒప్పందం ఉందని గత కొన్ని నెలలుగా రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. సిద్ధరామయ్య పదవీకాలం సగానికి చేరుకుంటున్నందున, ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్ చేపట్టబోతున్నారనే ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి.

జ్యోతిష్కుడిని అడగండి

ఈ ప్రచారంపై డీకే శివకుమార్ స్పందిస్తూ.. సీఎం మార్పు గురించి నేను చెప్పలేను. ఆ ప్రశ్న జ్యోతిష్కుడిని అడగండి. నాకు ఆ విషయం తెలియదు. నేను పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని అన్నారు. ఇక నవంబర్, డిసెంబర్ నెలల్లో నాయకత్వంలో మార్పు ఉంటుందని వస్తున్న వదంతులను కూడా ఆయన తోసిపుచ్చారు. నవంబర్ విప్లవం ఏమీ రావడం లేదు. 2028లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు.

సీఎం పీఠం మార్పుపై పదే పదే ప్రశ్నలు ఎదురవుతున్నప్పటికీ, డీకే శివకుమార్ తాను పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిని అని, హైకమాండ్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 

తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని వస్తున్న వార్తలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. నేను కాంగ్రెస్‌ను బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తిని కాదు. ఈ పార్టీని నిర్మించాను. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తానని తేల్చి చెప్పారు.

మంత్రివర్గ మార్పుపై చర్చించడానికి ఢిల్లీ వచ్చారనే వార్తలను ఖండిస్తూ, తాను కొత్తగా నిర్మించబోయే 100 పార్టీ ఆఫీసులకు శంకుస్థాపన కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించడానికి మాత్రమే వచ్చానని వివరించారు. ప్రస్తుతానికి, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యదేనని, ఆయన హైకమాండ్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు