భారత్‌ అమ్ములపొదిలో చేరనున్న ధ్వని మిస్సైల్‌

DRDO అభివృద్ధి చేస్తున్న హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ (HGV) క్షిపణి 'ధ్వని' త్వరలో భారత సైనిక దళాల అమ్ములపొదిలో చేరనుంది. ఈ క్షిపణి సాధారణ ధ్వని ప్రయాణించే వేగం కంటే ఐదు రెట్లు అధిక వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

New Update
Dhvani missile

భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా మరో భారీ ముందడుగు వేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన క్షిపణి టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో చేరడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా DRDO అభివృద్ధి చేస్తున్న హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ (HGV) క్షిపణి 'ధ్వని' త్వరలో భారత సైనిక దళాల అమ్ములపొదిలో చేరనుంది. ఈ క్షిపణి సాధారణ ధ్వని ప్రయాణించే వేగం కంటే ఐదు రెట్లు అధిక వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే, ఈ క్షిపణి గంటకు 7,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు. ప్రస్తుతం భారతదేశం వద్ద ఉన్న బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి కంటే ఇది చాలా ఎక్కువ వేగం. దీంతో శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ వాటిని ధ్వంసం చేయడానికి ఏమాత్రం సమయం దొరకదు.

'ధ్వని' క్షిపణి 1,500 నుండి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని భావిస్తున్నారు. ఇది సాధారణ క్రూయిజ్ క్షిపణుల్లా కాకుండా, రాకెట్ సహాయంతో మొదట అత్యంత ఎత్తుకు చేరుకుంటుంది. ఆ తర్వాత, రాకెట్ నుంచి విడిపోయిన గ్లైడ్ వెహికల్ (HGV) హైపర్‌సోనిక్ వేగంతో, వంకర మార్గాల్లో ప్రయాణిస్తూ టార్గెట్‌ వైపు దూసుకుపోతుంది. ఈ సామర్థ్యం కారణంగా శత్రు రాడార్లకు చిక్కకుండా, తన దిశను మార్చుకుంటూ దాడి చేయగలదు. DRDO ఇప్పటికే ఈ క్షిపణికి సంబంధించిన ఏరోడైనమిక్స్, థర్మల్ మేనేజ్‌మెంట్, స్క్రామ్‌జెట్ ఇంజిన్ పనితీరు, గైడెన్స్ వ్యవస్థలకు సంబంధించిన క్షేత్ర స్థాయి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 'ధ్వని' HGV పూర్తి స్థాయి పరీక్షలను నిర్వహించాలని DRDO లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ పరీక్షలు విజయవంతమైతే, 'ధ్వని' భారత సైన్యంలో చేరడం ఖాయం. అప్పుడు, ఈ అత్యాధునిక హైపర్‌సోనిక్ టెక్నాలజీని కలిగి ఉన్న ప్రపంచంలోని అతికొద్ది దేశాల సరసన భారత్ చేరనుంది.

Advertisment
తాజా కథనాలు