PM Modi degree controversy: ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై.. CIC ఆదేశాల‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివాదంపై ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. ప్రధాని మోడీ బ్యాచిలర్ డిగ్రీ (బీఏ) వివరాలను బహిర్గతం చేయాలంటూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.

New Update
Modi degree controversy

Modi degree controversy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివాదంపై ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. ప్రధాని మోడీ బ్యాచిలర్ డిగ్రీ BA వివరాలను బహిర్గతం చేయాలంటూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. దీనితో పాటు, ప్రధాని డిగ్రీని బహిర్గతం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఈ వివాదం 2016లో ఒక RTI దరఖాస్తుతో ప్రారంభమైంది. ఆ దరఖాస్తులో ప్రధానమంత్రి మోడీ ఢిల్లీ యూనివర్సిటీ నుండి 1978లో బీఏ డిగ్రీ పూర్తి చేశారని ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నందున, ఆ సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరి వివరాలను వెల్లడించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన సీఐసీ, ప్రధాని విద్యార్హతలకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, వివరాలను వెల్లడించాలని ఢిల్లీ యూనివర్సిటీని ఆదేశించింది.

సీఐసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. విద్యార్థుల సమాచారం అనేది వ్యక్తిగతమైనది, గోప్యతకు సంబంధించినదని, ఇది "పబ్లిక్ డొమైన్"లో ఉండాల్సిన అవసరం లేదని యూనివర్సిటీ తరపు న్యాయవాదులు వాదించారు. కేవలం ఆసక్తి లేదా ఉత్సుకత కోసం వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం ఆర్టీఐ చట్టానికి విరుద్ధమని కూడా పేర్కొన్నారు.

ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా, ప్రధాని మోడీ డిగ్రీ వివరాలు "వ్యక్తిగత సమాచారం" పరిధిలోకి వస్తాయని, దానిని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. "ప్రజలకు ఆసక్తి కలిగించే సమాచారం వేరు, ప్రజా ప్రయోజనానికి సంబంధించిన సమాచారం వేరు" అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. విద్యార్హతలు ఏ పదవిని నిర్వహించడానికి లేదా అధికారిక బాధ్యతలను నిర్వర్తించడానికి చట్టబద్ధమైన అవసరం లేనప్పుడు, వాటిని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో గత కొంత కాలంగా కొనసాగుతున్న మోడీ డిగ్రీ వివాదానికి ముగింపు పడినట్లు అయింది.

Advertisment
తాజా కథనాలు