/rtv/media/media_files/2025/12/25/fotojet-6-2025-12-25-19-23-40.jpg)
PAN-Aadhaar Link
PAN-Aadhaar Link : ప్రస్తుత కాలంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా లేదా ప్రభుత్వ పథకాలు పొందాలన్నా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తప్పనిసరి. నకిలీ పాన్‌లను నిరోధించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) దీన్ని తప్పనిసరి చేసింది. అయితే ఈ రెండింటినీ లింక్ చేయడం కేంద్ర ప్రభుత్వం మ్యాండేట్ చేసింది. గతంలో తీసుకున్న పాన్, లేదా ఆధార్ ఎన్‌రోల్మెంట్ ఐడీ ద్వారా పాన్ తీసుకున్న వారు తప్పనిసరిగా డిసెంబరు 31లోగా పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిందే. లింక్ చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డ్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.
2024 అక్టోబరు 1 కంటే ముందు ఆధార్ ఎన్‌రోల్మెంట్ ఐడీతో పాన్ కార్డు తీసుకున్న వారికి ఆధార్-పాన్ అనుసంధానం కోసం ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు తుది గడువు కల్పించింది. మిగతా వారికి 2023 జూన్‌లోనే డెడ్‌లైన్ ముగిసింది. ఆ తర్వాత నుంచి లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయడం లేదు. అలాంటి పాన్ కార్డులను కూడా రూ.1000 పెనాల్టీ ఫీజు చెల్లించి ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. అలా చేస్తేనేపాన్ తిరిగి పనిచేస్తుంది.
ఒక వేళ లింక్ చేయకపోతే?
ఆధార్‌తో పాన్ అనుసంధానం చేయకపోతే పాన్ రద్దయి.. ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయడం కుదరదు.
మనకు రావాల్సిన పన్ను రీఫండ్లు, నిలిచిపోతాయి. పెండింగ్ రిటర్నులను ప్రాసెస్ చేయడానికి కుదరదు.
బ్యాంకు లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్లు తదితర పెట్టుబడులపై అధిక టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) విధించే అవకాశం ఉంది.
రూ.50,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు చేయడం కష్టతరమవుతుంది.
డీమ్యాట్ ఖాతాను ప్రారంభించేందుకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యం కాదు.
రుణాలు తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
ఎలా లింక్ చేసుకోవాలంటే?
ఆధార్,-పాన్ లింక్ కోసం.. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ అధికారిక వెబ్‌సైట్ www.incometax.gov.in లోకి వెళ్లాలి.
హోం పేజీలోని క్విక్ లింక్ సెక్షన్‌లో Link Aadhaar అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత పాన్, ఆధార్ నంబర్లను ఎంటర్ చేయాలి.
ఆధార్ కార్డులో ఉన్న ప్రకారం మన పేరును ఎంటర్ చేయాలి.
ఆధార్ వివరాలను ధ్రువీకరిస్తూ I agree అనే చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయాలి.
పెనాల్టీ రూ.1000 చెల్లించాలి (అవసరం ఉన్నవారు). ఇందుకోసం పాన్ నంబరును ఓటీపీతో కన్ఫామ్ చేస్తే ఇ-పే ట్యాక్స్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
అక్కడ 2025-26 మదింపు సంవత్సరానికి ఎంచుకుని అక్కడున్న వివరాలను నమోదు చేయాలి. పెనాల్టీ మొత్తం చూపించిన తర్వాత ‘కంటిన్యూ’పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
పేమెంట్ విధానాన్ని (నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు వంటివి) ఎంచుకుని చెల్లింపు పూర్తిచేయాలి. ఆ తర్వాత చలాన్ జనరేట్ అవుతుంది.
ఆ తర్వాత మళ్లీ ‘లింక్ ఆధార్’ సెక్షన్‌కు వచ్చి పాన్, ఆధార్ నంబర్లను ఎంటర్ చేయాలి.
ఓటీపీ ఎంటర్ చేసి మీ వివరాలను ధ్రువీకరించుకోవాలి.
అనుసంధానం అయ్యిందో లేదో తెలుసుకోవడం ఎలా?
ఒకవేళ ఇప్పటికే మీరు ఆధార్,-పాన్ లింక్ ప్రక్రియను పూర్తి చేసి.. అనుసంధానం చేసిందీ లేనిదీ గుర్తు లేకపోతే దాన్ని చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లోకి వెళ్లి దీన్ని తనిఖీ చేసుకోవచ్చు. ‘లింక్ ఆధార్ స్టేటస్’పై క్లిక్ చేసి పాన్, ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి. ‘Link Aadhaar Status’ను క్లిక్ చేయాలి. ఒకవేళ ఇదివరకే అనుసంధానం చేసి ఉంటే.. లింక్ అయినట్లు సందేశం కనిపిస్తుంది. పెండింగ్‌లో ఉండే.. ‘మీ అభ్యర్థనను ఉడాయ్ వాలిడేషన్ కోసం పంపించాం’ అనే మెసేజ్ వస్తుంది.
లింక్ చేయకపోతే.. ?
పాన్ కార్డ్ గడువులోగా లింక్ చేయకపోతే మీ ఆర్థిక కార్యకలాపాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం, పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు పొందడం కూడా సాధ్యం కాదు. అంతేకాక స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, కేవైసీ ఆధారిత లావాదేవీలలో అంతరాయం కలుగుతుంది. లింక్ చేయని వారిపై ఎక్కువ TDS లేదా TCS విధించే అవకాశం కూడా ఉంది.
లింకింగ్ స్టేటస్ చెక్కింగ్..
మీ పాన్ ఇప్పటికే ఆధార్‌తో లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు:
1. మొదట www.incometax.gov.in పోర్టల్‌కి లాకిన్ కావాలి.
2. 'Quick Links' విభాగంలో 'Link Aadhaar Status' పై క్లిక్ చేయండి.
3. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
4. 'View Link Aadhaar Status' బటన్ నొక్కండి. అక్కడ మీకు 'Linked' అని కనిపిస్తే మీ పని పూర్తయినట్లే. ఒకవేళ 'Not Linked' అని ఉంటే వెంటనే లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.
ఇలా చేయండి
వెబ్‌సైట్‌లోని 'Link Aadhaar' ఆప్షన్ ద్వారా మీ వివరాలను నమోదు చేసి, మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఒకవేళ గతంలోనే పేమెంట్ చేసి ఉంటే.. 4-5 రోజులు ఆగాల్సి ఉంటుంది. ఒక పాన్ మరొక ఆధార్‌తో పొరపాటున లింక్ అయ్యి ఉంటే.. సంబంధిత అధికారులను కలిసి సరిచేసుకోవాలి. దీన్ని పూర్తి చేసేందుకు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే మీ పాన్-ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేసి వెంటనే పూర్తి చేసుకోండి.
Follow Us