Bihar Exit Polls: బీహార్‌లో మళ్లీ NDAదే అధికారం.. 6 ప్రధాన కారణాలు ఇవే

బీహార్‌లో మంగళవారం రెండో దశ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. అన్నిసర్వేలు కూడా ఎన్డీయేనే అధికారంలోకి రాబోతుందని వెల్లడించాయి.

New Update
Bihar Exit polls shows NDA to remain in Power

Bihar Exit polls shows NDA to remain in Power

బీహార్‌లో మంగళవారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. అన్నిసర్వేలు కూడా ఎన్డీయేనే అధికారంలోకి రాబోతుందని వెల్లడించాయి. పీపుల్స్ పల్స్, దైనిక్‌ భాస్కర్, నెట్‌వర్క్‌ 18, టైమ్స్‌ నౌ జేవీసీ లాంటి సర్వే సంస్థలన్నీ కూడా ఎన్డీయే క్లీన్‌స్వీప్‌ చేస్తుందని పేర్కొన్నాయి. ఇక మహాగఠ్‌బంధన్‌ కుటమి మాత్రం100 సీట్ల లోపే పరిమితం కావొచ్చని పేర్కొన్నాయి. జన్‌సురాజ్‌ పార్టీ కూడా 0-5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం చూసుకుంటే ఈసారి మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్డీయే గెలవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వం

ఈ అసెంబ్లీ ఎన్నికలను మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ర్యాలీలో కూడా మోదీ.. బీహార్‌లో ఎన్డీయే నేతృత్వంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి గురించి చెబుతూ.. కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీలను తీవ్రంగా విమర్శించారు. గతంలో పాలించిన ఆ పార్టీల వల్ల అభివృద్ధి జరగలేదంటూ చెప్పుకొచ్చారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఉజ్వల, ఆవాస్‌ యోజన లాంటి సంక్షేమ పథకాలను ఎన్డీయే కూటమి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. నితీశ్‌ కుమార్‌ కూడా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి.. తమ ప్రభుత్వం చేసిన పనులు, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల వద్దకు చేర్చారు. అలాగే నితీశ్‌ కుమార్‌ అక్కడ బలమైన నేతగా కొనసాగుతున్నారు. 

మహిళా ఓటర్ల సపోర్ట్ 


నితీశ్‌ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌.. బీహార్‌ మహిళలను లక్ష్యంగా చేసుకొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. మహిళల స్వయం ఉపాధి కోసం రూ.10 వేల ఆర్థిక సాయం, గతంలో మద్యపానం నిషేధం లాంటి మహిళా ఓటర్లను ప్రభావితం చేసినట్లు కనిపిస్తుంది. అంతేకాదు మొదటి దశలో రికార్డు స్థాయిలో మహిళా ఓటర్లు పాల్గొనడం కూడా ఎన్డీయేకు అనుకూలంగా మారినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. 

జంగిల్ రాజ్ భయం

1995 నుంచి 2004 వరకు ఆర్జేడీ అధికారంలో ఉంది. ఆ సమయంలో నేరాలు, అవినీతి లాంటివి ఎక్కువగా జరిగాయనే ప్రచారం ఉంది. దీంతో ఎన్డీయే కూటమి ఆర్జేడీని ఉద్దేశించి జంగిల్‌ రాజ్‌(అరాచక పాలన) అంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆర్జేడీ గెలిస్తే మళ్లీ బీహార్‌లో నేరాలు, అవినీతి పెరిగిపోతుదంటూ ఆ కూటమి నేతలు ప్రచారం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా బీహార్‌ ఓటర్లు ఎన్డీయే వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 

నిరుద్యోగంపై టార్గెట్ 

విపక్ష కూటమి మహాగఠ్‌ బంధన్ నిరుద్యోగాన్ని లక్ష్యంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ యాదవ్‌ హామీ ఇచ్చారు. అయినప్పటికీ బీహార్ ప్రజలు ఆయన మాటలపై నమ్మకం పెట్టుకోలేదని తెలుస్తోంది. మరోవైపు ఎన్డీయే తాము అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు తమ పాలనలో ఇప్పటిదాకా యువతకు 50 లక్షల ఉద్యోగాలు కల్పించామని నితీశ్‌ కుమార్‌ ప్రచారం చేశారు. అలాగే డబుల్‌ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి మరింత పెట్టుబడులు, ఉద్యోగవకాశాలు మెరుగుపడతాయని ఎన్డీయే కూటమి నేతలు ప్రచారం చేశారు. అంతేకాదు బడ్జెట్‌లో కూడా మోదీ ప్రభుత్వం బీహార్‌కు ఎక్కువ నిధులు కేటాయించడం కూడా ఓ ప్లస్‌ పాయింట్ అయ్యింది. 

సుస్థిర ప్రభుత్వం

బీహార్‌లో రాజకీయాలు తరచుగా అస్థిరతకు గురవుతాయి. అయితే ఎన్డీయే సర్కార్ మాత్రం తమ ప్రభుత్వం సుస్థిరమైనదనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) చేపట్టింది. ఇందులో దాదాపు 65 లక్షల ఓటర్లను తొలగించారు. ఈ ప్రక్రియ వల్ల కూడా వాస్తవ ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగిన ఈ ఓటింగ్ శాతం కూడా ఎన్డీయేకు అనుకూలంగా పడ్డట్లు నిపుణులు భావిస్తున్నారు. సీట్ల కేటాయింపు విషయంలో మహాగఠ్‌బంధన్‌ కూటమిలో విభేదాలు వచ్చాయి. కానీ ఎన్డీయే మాత్రం చాకచక్యంగా వ్యవహరించి, ఎలాంటి విభేదాలు లేకుండా సీట్ల కేటాయింపు చేసుకుంది. 

జన్‌సురాజ్‌, ఎంఐఎం ప్రభావం

ఈ ఎన్నికల్లో జన్‌సురాజ్‌, ఎంఐఎం పార్టీలు ఓట్లు చీల్చినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్‌ ప్రకారం జన్‌సురాజ్‌ పార్టీకి 9.7 శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. 0 నుంచి 5 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. ఎంఐఎంతో కలిపి ఇతరులకు కూడా 6.2 శాతం ఓటింగ్‌ వస్తుందని తెలిపింది. దాదాపు 16 శాతం ఓటింగ్‌ శాతం చీలినట్లు కనిపిస్తోంది. ఇది ఎన్డేయే కూటమికి కలిసి వచ్చి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

Advertisment
తాజా కథనాలు