/rtv/media/media_files/2025/05/11/pLb63EE6WboWYSsVSC3r.jpg)
Asaduddin Owaisi
వెనిజులాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన 'ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్' ఇప్పుడు భారత రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సైనిక చర్య ద్వారా మదురోను బంధించి అమెరికాకు తరలించడాన్ని ఉదాహరణగా చూపుతూ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ఒక బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ.. "అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో దేశంలోకి వెళ్లి అక్కడి అధ్యక్షుడినే బంధించి తీసుకురాగలిగినప్పుడు, ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లి ముంబై దాడుల (26/11) సూత్రధారులను ఎందుకు తీసుకురాలేరు?" అని ప్రశ్నించారు.
మసూద్ అజర్ అయినా, లష్కరే తోయిబా క్రూరులైనా.. వారు పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారిని భారత్‌కు తీసుకువచ్చి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. "ట్రంప్ చేయగలిగింది, మోదీజీ మీరు ఎందుకు చేయలేరు?" అంటూ గతంలో ప్రధాని ఇచ్చిన 'అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్' నినాదాన్ని పరోక్షంగా గుర్తు చేస్తూ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు.
ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు గులాం అలీ ఖటానా స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదంపై అత్యంత కఠినంగా ఉందని, అయితే భారత్ ఎప్పుడూ అంతర్జాతీయ నియమాలను గౌరవిస్తుందని తెలిపారు. "మేము దేశాలను లక్ష్యంగా చేసుకోము, కేవలం ఉగ్రవాదులనే ఏరివేస్తాం. పొరుగు దేశాలు చిన్నవైనా, పెద్దవైనా వాటితో స్నేహపూర్వకంగా ఉండటమే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ బాధ్యత" అని ఆయన స్పష్టం చేశారు. ఒవైసీ వ్యాఖ్యలు కేవలం రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు.
బీహార్ మంత్రి ఎద్దేవా
బీహార్ మంత్రి దిలీప్ జైస్వాల్ సైతం ఒవైసీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ఒవైసీ ఎప్పుడూ వార్తల్లో ఉండాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఏకంగా ట్రంప్‌కే సలహాలు ఇస్తున్నారు. బహుశా ట్రంప్ కూడా ఒవైసీ సలహాలను పాటిస్తారేమో!" అని ఎద్దేవా చేశారు. మొత్తానికి, వెనిజులాలో జరిగిన ఈ అంతర్జాతీయ పరిణామం భారత్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది.
Follow Us