అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉంది. దీంతో అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక హామీ ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కేవలం 12 నెలల్లో ఇంధన, కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తానని తెలిపారు.
ఉచిత హామీలు అమెరికా చేరుకున్నాయి
అంతేకాకుండా విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. దీని కారణంగా ద్రవ్యోల్బణం తగ్గుతుందని.. మరీ ముఖ్యంగా అమెరికా మిచిగాన్‌లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ట్రంప్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ పోస్టుకు ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. విద్యుత్ బిల్లులు సగానికి తగ్గిస్తానని ట్రంప్ ప్రకటించడం పై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘ ఉచిత తాయిలాలు అమెరికా వరకు వెళ్లాయి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: ఆ వ్యూహమే బీజేపీని మళ్లీ మళ్లీ గెలిపిస్తోందా ?
దీనిపై ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కూడ తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రసంసలు కురిపించారు. కరెంట్ బిల్లులపై ట్రంప్ 50 శాతం తగ్గింపు అనేది ప్రపంచ వ్యాప్తంగా పరిపాలన కోసం అరవింద్ కేజ్రీవాల్ ఎలా సెట్ చేశారో చూపిస్తుందని రాసుకొచ్చారు. సరసమైన విద్యుత్, ఉచిత నీరు, నాణ్యమైన వైద్యం ఉచిత ప్రపంచ స్థాయి విద్య వంటివి ఆయన పాలనా నమూనా సరైనది అని చెప్పటానికి ఇదే ఉదాహరణ అంటూ తెలిపారు. ఈ మేరకు ప్రపంచం గమనిస్తోంది అంటూ పేర్కొన్నారు.
కాగా ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల కేజ్రీవాల్ ఢిల్లీలో జరిగిన ఒక బహిరంగ సభలో.. ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా, సీనియర్ సిటిజన్‌లకు తీర్థయాత్ర, మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్య - ఆరోగ్యం వంటి ఆరు హామిలు ఇస్తామని చెప్పారు. అలాగే పన్నులు చెల్లించని లేదా ఎలాంటి పెన్షన్ పొందని మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,000 సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
Also Read : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు అస్వస్థత