China Manja Danger : పండగ పూట మెడ చుట్టూ మృత్యుపాశం...ఈ రక్షణ తప్పనిసరి

ప్రాణాంతకమైన చైనా మాంజా - పండగ పూట మెడ చుట్టూ మృత్యుపాశంగా మారుతోంది. పండుగ మొదలు కాకముందే ఇప్పటికే పలువురు గాయాలపాలయ్యారు. ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో మెడ చుట్టూ కుట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మెడలకు రక్షణ పట్టీలు అందజేస్తున్నారు.

New Update
FotoJet - 2026-01-11T190458.276

Gujarat Police trying to save people from STSJ

Beware Of Chinese manza : ప్రాణాంతకమైన చైనా మాంజా - పండగ పూట మెడ చుట్టూ మృత్యుపాశంగా మారుతోంది. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల పతంగులతో నిండిపోతుంది. అయితే, ఈ ఆనందం వెనుక 'చైనా మాంజా' రూపంలో మృత్యువు పొంచి ఉందన్న నిజం ఇపుడు ఎవరినీ నిద్రపోనివ్వడం లేదు. సాధారణ నూలు దారానికి బదులుగా నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారు చేసే ఈ చైనా మాంజా అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఈ దారానికి గాజు ముక్కల పొడి, రసాయనాలు పూయడం వల్ల ఇది ఒక పదునైన కత్తిలా మారుతుంది. పతంగులు ఎగురవేసే క్రమంలో తెగిపోయి గాలిలో వేలాడే ఈ దారాలు వాహనదారుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. పండుగ మొదలు కాకముందే ఇప్పటికే పలువురు గాయాలపాలయ్యారు. ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో మెడ చుట్టూ కుట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది..

ఈ మాంజా పర్యావరణానికి , జీవరాశులకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇది ప్లాస్టిక్ లాంటి పదార్థం కావడంతో అంత సులభంగా తెగదు, కుళ్లిపోదు. చెట్లపై, విద్యుత్ తీగలపై చిక్కుకున్న ఈ దారాల్లో చిక్కుకుని వేలాది పక్షులు రెక్కలు తెగి, గొంతు కోసుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి. కేవలం పక్షులే కాదు, బైకులపై వెళ్లే ప్రయాణికులకు ఈ దారం తగిలితే మెడ నరాలు తెగి నిమిషాల వ్యవధిలోనే మరణిస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఏటా నమోదవుతూనే ఉన్నాయి. ఈ తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం చైనా మాంజా విక్రయాలు, వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. హైకోర్టు సైతం చైనా మాంజా విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది.

నిషేధం ఉన్నప్పటికీ, కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం రహస్యంగా ఈ మాంజాను స్మగ్లింగ్ చేస్తూ విక్రయిస్తున్నారు. పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తూ స్టాక్‌ను సీజ్ చేస్తున్నా, మార్కెట్లోకి ఇది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. కేవలం జరిమానాలు, అరెస్టులతోనే ఈ సమస్య తీరదని, ప్రజల్లో మార్పు రావాలని అధికారులు కోరుతున్నారు. పతంగుల పందాల కోసం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టే చైనా మాంజాను వాడొద్దని, సంప్రదాయ నూలు దారాన్ని మాత్రమే వాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.           

ఇలా కాపాడుకోండి...

ప్రస్తుతం ఈ ముప్పు నుండి ప్రజలను కాపాడేందుకు పోలీసులు వినూత్న ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బైక్ నడిపేవారు తమ మెడలకు రక్షణగా గొంతు చుట్టూ స్కార్ఫ్‌లు లేదా మఫ్లర్లు కట్టుకోవాలని, వీలైతే హెల్మెట్ బెల్ట్‌ను గట్టిగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని చోట్ల బైక్ హ్యాండిల్స్‌కు ప్రత్యేకమైన  సేఫ్టీ గార్డ్స్ నైలాన్ దారం తగలకుండా ఆపే ఇనుప చువ్వలు ఏర్పాటు చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. వాహనదారులు ఫ్లైఓవర్లపై వెళ్లేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గుజరాత్‌లో పోలీసులు, కొంతమంది సామాజిక కార్యకర్తలు వాహనదారులను చైనా మాంజా నుంచి కాపాడడం కోసం ఉత్తరాయన్‌ పేరుతో సెఫ్టీ బెల్ట్‌ మాదిరిగా ఉత్తరాయన్‌ పేరుతో మెడకు ప్రత్యేక పట్టీలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇవి మాంజా నుంచి వాహనదారుల ప్రాణాలను కాపాడుతాయని వారు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు