/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t092123805-2025-11-07-09-22-17.jpg)
150 Years Of Vande Mataram
150 Years Of Vande Mataram : వందేమాతరం.. ఈ నినాదం కోట్లాది మంది భారతీయులను ఏకం చేసింది. స్వతంత్ర పోరాటంలో ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపి బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడడంలో కీలక పాత్ర పోషించింది. బంకించంద్ర ఛటర్జీ కలం నుండి జాలువారిన ఈ జాతీయం గీతం ఆయన రచించించిన ఆనంద్ మఠ్ నుండి సంగ్రహించబడింది. ఈ గీతం, ఆ పదం స్వతంత్ర పోరాటంలో సమరశంఖమై గర్జించింది.
1875 వ సంవత్సరం నవంబర్ 7వ తేదీన బంగా దర్శన్ అనే లిటరరీ జర్నల్ లో మొట్టమొదటి సారిగా ఈ గీతం ప్రచురితమైంది. ఆ అద్భుతం అవిష్కృతమై ఈ రోజుకు సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తయింది. ఈ గీతాన్ని దేశానికి సంబందించిన మూడు ముఖ్యమైన ఆధారాలను ప్రతిబింబిస్తూ రాసారు బంకించంద్ర ఛటర్జీ. భిన్నత్వంలో ఏకత్వం, పుట్టిన గడ్డపై ఇది మనది అన్న ప్రేమ, దేశం మీద భక్తి అనే ఈ మూడు సూత్రాలే స్వాతంత్య్ర ఉద్యమానికి మూలంగా నిలిచాయి. ఇవే ఈ గీతం విన్న ప్రతిసారీ ఈనాటికి కూడా ప్రతి భారతీయుడి గుండెల్లో ఉప్పొంగే భావోద్వేగానికి కారణం కావడం గమనార్హం. ఈ 150 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక శాఖ ఈ సంవత్సరం మొత్తం కూడా వేడుకలను నిర్వహించనుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 9:50 నిమిషాలకు భారత దేశంలోని ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంటే అక్కడ లేచి నిలబడి ఈ గీతాన్ని అలపించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీంతో మరొక్కసారి భారతీయుల గుండె చప్పుడు గా నిలిచిన ఈ గీతం, 140 కోట్ల గోతుకలలో ఒక్కసారిగా ప్రతిధ్వనించనుంది.
భారత్‌లో వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందేమాతరం.. మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చింది. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి నేటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయి. 2025 నవంబర్ 7వ తేదీన ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. వందేమాతరం స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిందని ప్రకటిస్తూ, జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరానికి గౌరవం ఇచ్చారు.
Also Read : కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
Follow Us