/rtv/media/media_files/2025/12/31/bomb-2025-12-31-16-23-24.jpg)
ఉగ్రవాదులు పొంచి ఉన్నారు. మళ్ళీ దాడులకు పాల్పడవచ్చును జాగ్రత్త అంటూ నిఘా సంస్థలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. అది నిజం అవబోతోందా అంటే...అవుననే అనిపిస్తోంది. తాజాగా రాజస్థాన్ లో భారీగా పట్టుబడ్డ పేలుడు పదార్ధాలు ఈ అనుమానాలకు తావునిస్తున్నాయి. కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. దేశంలో భారీగా పేలుడు పదార్థాలు తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. రాజస్థాన్ లోని టోంక్ దగ్గరలో పోలీసులు మారుతి కారులో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల అమ్మోనియం నైట్రేట్, 2000 పేలుడు కాట్రిజ్‌లు, 1,100 మీటర్ల సేఫ్టీ ఫ్యూజ్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు.
యూరియా బస్తాల మాటున..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ లోని బోండి నుంచి టోంక్ కు పేలుడు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారం అందింది. దీని ప్రకారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో యూరియా బస్తాల మాటున అమ్మోనియం నైట్రేట్‌ను తరలిస్తున్న కారు పట్టుబడింది. వీటిని సురేంద్ర మోచి, సురేంద్ర పట్వాగా అనే వ్యక్తులు తీసుకువెళుతున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ పేలుడు పదార్థాలను వేటి కోసం పట్టుకు వెడుతున్నారనే దానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. పేలుడు పదార్థాలు మైనింగ్ సహా చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం ఉద్దేశించిందా? అనే కోణంలో విచారిస్తున్నారు. రవాణా చేయడానికి ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నారనే నిఘా వర్గాల స్పష్టమైన సమాచారంతో భారీ ఆపరేషన్ చేపట్టి వాటిని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశాం.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం.. దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లోనూ కేసును విచారిస్తున్నామని టోంక్ డీఎస్పీ మృత్యుంజయ్ మిశ్రా తెలిపారు.
అయితే ఈ పేలుడు పదార్థాల వెనుక మళ్ళీ ఢిల్లీ తరహా పేలుళ్ళకు కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో దొరికిన అమ్మోనియం నైట్రేట్ ఎక్కువగా ఎరువులకు వినియోగిస్తారు. అదే కాకుండా..పేలుళ్ళకు కూడా వాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుళ్ళల్లో ఉగ్రవాదులు ఈ రసాయనాన్నే వాడారు. నవంబరు 10న ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. దానికన్నా ముండు ఫరీదాబాద్ లో అమ్మోనియం నైట్రేట్ తో సహా 2, 900 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తాజాగా కూడా అదే దొరకడంతో దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
Follow Us