సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుంది. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' ఓ వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. అంతరిక్షంలో ఏకంగా పామును పోలి ఉండే ఓ రోబోను తీసుకెళ్లేలా పరీక్షలు చేస్తోంది. చంద్రుడు అలాగే అంగారక గ్రహంపై పలు ప్రాంతాల్లో పరిశోధనలు చేయడానికి దీన్ని ఉపయోగించనున్నారు. ఇండియాలో కనిపించే కొండచిలువ ఆకారం.. అది కదిలే తీరును ఆధారంగా తీసుకొని ఈ సరికొత్త రోబోను తయారు చేశారు. మరో విషయం ఏంటంటే.. భారత సంతతికి చెందిన ఇంజనీరే ఈ ఐడియాను ఇవ్వడం విశేషం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రోహణ్ టక్కర్.. ప్రస్తుతం నాసాలోని జెట్ ప్రొపల్షన్ అనే లాబోరేటరీలో విధులు నిర్వహిస్తున్నారు. ‘ఎగ్జోబయోలజీ ఎక్స్‌టంట్ లైఫ్ సర్వేయర్ (EELS)’ అనే పేరుతో పిలుస్తున్న ఈ రోబో పాము ఈయన ఆలోచనే. అయితే ఇతర గ్రహాల్లో ఎలాంటి ప్రదేశాల్లోనైనా ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉందని రోహణ్ తెలిపారు. పగుళ్లు, గుహలు, అలాగే నీటి లోపల కూడా ఈ రోబో తరహా పాము ప్రయాణించగలదని చెప్పారు. అయితే 'ఈఈఎల్‌ఎస్'ను ఇప్పటికే కృత్రిమంగా తయారు చేసిన కొండ ప్రదేశాలు, మంచు కొండలపై పరీక్షలు చేశామని తెలిపారు.
Also Read: జమ్మూ కశ్మీర్ లో పెను విషాదం..36 మంది దుర్మరణం..!!
అలాగే దీన్ని విపత్తులు వచ్చినప్పుడు కూడా సహాయ కార్యక్రమాల్లో వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. నాసా కోసం ‘మార్షియన్ హెలికాప్టర్’ను రూపొందించిన ఐఐటీయన్ బాబ్ బలరాం నుంచి తాను స్ఫూర్తి పొందానని పేర్కొన్నారు. అయితే స్కూల్లో చదువుకునేటప్పుడు తాను అంత చురుగ్గా ఉండేవాన్ని కాదని.. ఐఐటీలో కూడా సీటు సంపాదించలేకపోయినట్లు చెప్పారు. కానీ చివరికి నాసాలో పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. అలాగే ఇటీవల ఇండియా సాధించిన చంద్రయాన్-3 విజయంపై కూడా రోహణ్ సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ నెట్ వర్క్ ను ఆవిష్కరించిన చైనా