Nara Lokesh: జగన్‌కు ఇంకా తత్వం బోధ పడినట్లు లేదు.. త్వరలో ఆ ఒకటి మాయం అవుతుంది: లోకేష్‌

వైఎస్ జగన్‌కు ఇంకా తత్వం బోధ పడినట్లు లేదని టీడీపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉక్రోషంతో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. 11లో ఒకటి మాయం అవుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

author-image
By srinivas
Nara Lokesh: జగన్‌కు ఇంకా తత్వం బోధ పడినట్లు లేదు.. త్వరలో ఆ ఒకటి మాయం అవుతుంది: లోకేష్‌
New Update

AP News: పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు ఇంకా తత్వం బోధ పడినట్లు లేదని టీడీపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. 50 రోజుల ప్రభుత్వంలో తాము భయంతో ఉండడం కాదు.. ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతతో ఉన్నామని చెప్పారు. మీరే ఇంకా భ్రమల్లో ఉన్నారనే విషయం తెలుసుకోవాలంటూ విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జగన్ పోస్ట్ కు కౌంటర్ ఇచ్చిన లోకేష్.. జగన్ మాటల్లో, చేష్టల్లో, కుట్రల్లో అడుగడుగునా అధికారం దూరం అయ్యిందనే బాధ కనిపిస్తోందన్నారు. అక్రమార్జన ఆగిపోయిందనే ఆవేదన కనిపిస్తోంది. ఫేక్ రాజకీయం పండడం లేదనే ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. ఉనికి చాటుకోలేకపోతున్నామనే నిస్పృహ కనిపిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉక్రోషం కనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఇప్పటికైనా తెలుసుకోండి..
జగన్ గారూ.. ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమి కట్టబెట్టింది ప్రజలు. దానికి కారణాలు ఇప్పటికైనా తెలుసుకోండి.. వాస్తవాలు అంగీకరించండి. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ఉంటే మొన్న ఎన్నికల్లో 151లో 5 మాయం అయ్యింది.. ఇప్పుడు 11 లో ఒకటి మాయం అవుతుంది. శిశుపాలుడు ఎవరో..ఎవరి పాపం పండిందో మొన్న ప్రజలే తేల్చి చెప్పారు. 5 ఏళ్ల పాటు మీరు సాగించిన విధ్వంసాన్ని 50 రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం తుడిచెయ్యలేదంటూ మీరు చేసే విష ప్రచారం ప్రజామోదం పొందదు. ఇక భయం గురించి అంటారా.. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించిన మాకెందుకు భయం? ఎవరిని చూసి భయం? మీ తీరు చూస్తుంటే.. మొన్నటి ఓటమి భయం మిమ్మల్ని తీవ్రంగా వెంటాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: Rahat Fateh: దుబాయ్‌ ఎయిర్ పోర్టులో స్టార్ సింగర్ అరెస్ట్?

జగన్ ఎమన్నారంటే..
అంతకు ముందు.. కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోంది. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్‌ కూడా ప్రవేశపెట్టలేక పోతోంది. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుంది. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడంటే.., పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుందన్న “భయం’’, ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు, అమలు చేయని పరిస్థితిలో.., ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న ‘‘భయం’’. అందుకే ప్రజల దృష్టిని మళ్లించే రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. వీటన్నింటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదు అన్న పరిస్థితి సృష్టిస్తున్నారు.

ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం. మరొకటి ప్రతిపక్షం. ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది. కాబట్టి, ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలి. ఆ పార్టీ నాయకుడినే, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి!. కానీ, ఆ పని చేస్తే.. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీలో హక్కుగా మైక్‌ ఇస్తే, ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో.. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా, చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా, చంద్రబాబునాయుడి పాపాలు కూడా పండే రోజు వేగంగా దగ్గర్లోనే ఉంది. నాతో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు, ముఖ్యనాయకులు ఢిల్లీకి వెళ్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని.. 24వ తేదీన, అక్కడ ఫోటో గ్యాలరీ.. ప్రొటెస్ట్‌ ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని, పరిస్థితులను చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంతో, మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తాం.

#nara-lokesh #ys-jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి