టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన పార్టీ నేతలతో కలిసి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మంగళవారం కలిశారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని..టీడీపీ నేతలు, కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడుతుందని ఆయన గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాతతో పాటు ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్ బాబులు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ, ఎస్సీ, ఎస్టీ లపై దాడులు పెరిగాయని లోకేశ్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో బీసీ వర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ్ నోట్లో పేపర్లు కుక్కి, పెట్రోల్ పోసి వైసీపీ నేతలు తగలబెట్టారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆయనకు వివరించామని లోకేష్ పేర్కొన్నారు.
వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన విషయాన్ని ఆయనకు వివరించమన్నారు. 17ఏ సెక్షన్ ను జగన్ ప్రభుత్వం నామారూపాలు లేకుండా చేసిందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల మీద జగన్ నర నరానా కక్ష సాధింపే ఉందన్నారు. టీడీపీ తరుఫున ఎవరైనా సానుభూతి పరులు ఉంటే..వారి పై ఇప్పటి వరకు 60 వేల కేసులు పెట్టారని తెలిపారు.
న్యాయ వ్యవస్థ పై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని..ప్రజల తరుఫున పోరాడుతున్న వారి పై దొంగ కేసులు పెడుతున్నారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్ ని కోరినట్లు లోకేష్ వివరించారు. ప్రతి పక్ష నేత చంద్రబాబు పై ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడా ఆయనను అన్యాయంగా 53 రోజుల పాటు జైలులో నిర్భంధించినట్లు తెలిపారు.
చంద్రబాబుని అరెస్ట్ చేసిన సమయంలో పవన్ కల్యాణ్ ని రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్న విషయం పై కూడా గవర్నర్ కి వివరించామన్నారు.
రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి నేత , కార్యకర్త ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతారన్నారు. అలాగే ఓటర్ల జాబితాలో అవకతవకలు, దొంగ ఓట్లపైనా టీడీపీ పోరాటం కొనసాగుతుందన్నారు.
Also read: ఖాళీ బొకేతో ప్రియాంక గాంధీని ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు!