జనగామ బీఆర్‌ఎస్‌లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సొత పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలనే టార్గెట్‌గా చేసుకొని పల్లా ఈ వ్యాఖ్యలు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ శాసన సభ్యుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు కుక్కలైతే ఎమ్మెల్సీ గాడిద అవుతాడా అని ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి బలిసిందని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఉన్నవారు అమాయక ప్రజల మీద డబ్బులు ఆశ చూపుతూ అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని విమర్శించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కాగా శనివారం దివ్యాంగులకు ఆసరా ఫిన్షన్ పెంపు కార్యాక్రమంలో పాల్గొన్న ముత్తిరెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ తనకు సముచిత స్థానం కల్పిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను సీఎం కేసీఆర్ పిలుపు మేరుకు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లోకి వచ్చానని, తనకు కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. కానీ కొందురు నేతలు మాత్రం తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి వాడినో కేసీఆర్‌కు తెలుసని, జనగామ ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ధీమావ్యక్తం చేశారు.