Mothkupally Narasimhalu Meet DK Shiva Kumar: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు(Mothkupally Narasimhalu) కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందా? అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచులు. బీఆర్‌ఎస్(BRS) పార్టీని వీడాలని నిర్ణయించుకున్న మోత్కుపల్లి నర్సింహులు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం నాడు బెంగళూరు వెళ్లిన మోత్కుపల్లి నర్సింహులు.. తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల వ్యవహారాలను చూసుకుంటున్న డీకే శివకుమార్‌ను కలిశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు తన సుముఖతను వ్యక్తం చేశారు. డీకే శివకుమార్ తనను పార్టీలోకి ఆహ్వానించారని, హైదరాబాద్‌కు వచ్చాక పూర్తి వివరాలను వెల్లడిస్తానని మోత్కుపల్లి తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో సుధీర్ఘ కాలం పని చేసిన మోత్కుపల్లి నర్సింహులు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగానూ సేవలందించారు. 2009లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ఎన్నికల్లో ఓటమి పాలవగా.. కాస్త సైలెంట్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన స్తబ్ధుగా ఉంటూ వచ్చారు. అయితే, ఆ తరువాత మళ్లీ ఆయన యాక్టీవ్ అయిన మోత్కుపల్లి.. టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అక్కడి వాతావరణంలో ఆయన ఇమడలేక.. బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. తనకు ఏదైనా ఒక పదవి లభిస్తుందన్న ఆశతో ఆయన ఇంతకాలం కొనసాగారు. ఎన్నికల్లో టికెట్ అయినా కేటాయిస్తారని భావించారు. కానీ, గులాబీ బాస్ ఆయనకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు. టికెట్ కూడా ఇవ్వలేదు. దాంతో ఇక లాభం లేదనుకున్న మోత్కుపల్లి.. ఇతర పార్టీలవైపు చూశారు. అల్రెడీ బీజేపీ నుంచే బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఆయన.. కాంగ్రెస్ అయితే బెటర్ అనుకుని, ఆ పార్టీలో చేరేందుకు ఫిక్స్ అయ్యారు. కేసీఆర్ తనకు టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చే పార్టీలో చేర్చుకున్నారని, ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మోత్కుపల్లి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే.. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైపోయారు.
తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్న మోత్కుపల్లి..
కాంగ్రెస్ వైపు చూస్తున్న మోత్కుపుల్లి నర్సింహులు.. తుంగతుర్తి నియోజకవర్గం టికెట్ ఆశిస్తు్న్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ఇక్కడి నుంచి గెలిచిన నేపథ్యంలో.. ఈసారి కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలియజేశాడు మోత్కుపల్లి. పెద్దలతో తన అభీష్టాన్ని చెప్పారు కానీ.. మోత్కుపల్లికి తుంగతుర్తి టికెట్ కేటాయించేనా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే.. తుంగుతుర్తి కాంగ్రెస్ బరిలో ఇప్పటికే ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. అద్దంకి దయాకర్ గత ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా ఆయన ఈ స్థానం నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మందుల సామేలు.. తుంగతుర్తి నియోజకవర్గం సీటును ఆశిస్తున్నారు. వీరిద్దరూ ఇలా ఉండగానే.. ఇప్పుడు మోత్కుపల్లి ఎంట్రీ ఇవ్వడం తుంగతుర్తి కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. మరి ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ వస్తుందో? ఎంటో? అనేది తెలియాలంటే కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే.
Also Read:
Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు
Vishal: సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ వైరల్.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..!