Mother Killed His Son: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీగ్రామంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం మోజులో పడ్డ ఓ తల్లి.. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సొంత కొడుకునే హతమార్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని లక్ష్మి, రవీందర్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు హాస్టళ్లో ఉంటూ చదువుకుంటున్నారు. చిన్న కొడుకు హరికృష్ణ (11) ఇంటి దగ్గరే ఉంటూ.. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు.
Also Read: రూ.100 కోట్లు కాదు.. రూ.600 కోట్ల స్కామ్: ఈడీ
అయితే లక్ష్మికి అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే తన అక్రమ సంబంధానికి కొడుకు హరికృష్ణ అడ్డుగా ఉన్నాడని తల్లి భావించింది. భర్త రవీందర్ పొలం పనుల కోసం అక్కడికి వెళ్లాడు. దీంతో ఇంట్లో ఉన్న హరికృష్ణ తలపై.. తల్లి లక్ష్మి కర్రతో బలంగా కొట్టింది. తీవ్ర గాయాలపాలైన హరికృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన తల్లి.. అతడి మృతదేహాన్ని ఇంటి ఆవరణలో ఉన్న నీటి కుండిలో వేసింది. తన కొడుకు నీటి కుండిలో మునిగి చనిపోయాడని.. చుట్టుపక్కల ఉన్నవారిని నమ్మించేందుకు తల్లి ప్రయత్నాలు చేసింది. కానీ అది ఫలించలేదు.
హరికృష్ణ తలపై రక్తపు గాయాలు ఉండటాన్ని స్థానికులు గమనించారు. చివరికి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకొని విచారించారు. చివరికి ఆమె తన కొడుకును చంపినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్