Modi ka Parivar Trends on Twitter: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ పెద్ద ప్రయోగమే చేస్తున్నట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పేరుకు ముందు 'మోదీ కా పరివార్(మోదీ కుటుంబం)' అని పేరును యాడ్ చేసుకుంటున్నారు పార్టీ నేతలు. మోదీ కా పరివార్ అని యాడ్ చేసుకున్న వాళ్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సహా పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. సోమవారం తెలంగాణలో జరిగిన ర్యాలీలో మోదీ ఈ నినాదాన్ని ఇచ్చారు. అమిత్‌షా, నడ్డాతో పాటు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా, డాక్టర్ వీరేంద్ర కుమార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, రాజ్యసభ ఎంపీ సుధాన్షు త్రివేది, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య, ఎంపీలు మనోజ్ తివారీ, ప్రేమ్ సింగ్ తమాంగ్ సహా పలువురు పెద్ద నేతలు సోషల్ మీడియాలో తమ పేర్లను మార్చుకున్నారు.
నరేంద్ర మోదీ ఎవరు?
ప్రతిపక్ష కూటమి 'INDIA'లో భాగమైన రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మోదీపై చేసిన వ్యాఖ్యల తర్వాత బీజేపీ ఈ విధంగా వ్యవహారించడం చర్చనీయాంశమవుతోంది. మోదీకి కుటుంబం లేకపోతే మనమేం చేయగలమని లాలూ చేసిన వ్యాఖ్యలకు ఇది కౌంటర్‌గా కనిపిస్తోంది. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన మెగా ర్యాలీలో లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ ఎవరని లాలూ యాదవ్ ప్రశ్నించారు. తమపై వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారని.. మోదీకి సొంత కుటుంబం లేకపోతే మనం ఏం చేయగలమన్నారు. మోదీ అసలు నిజమైన హిందువు కూడా కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సంప్రదాయాలలో తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, కొడుకు తల, గడ్డం తీయాలని.. మోదీ తన తల్లి చనిపోయాక ఈ పని చేయలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లాలూ.
నా భారతదేశం నా కుటుంబం:తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మోదీ కుటుంబవాద రాజకీయాలపై మాట్లాడారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులతో తీవ్రంగా మునిగిపోయిన నేతలపై కామెంట్స్ చేశారు. 'నేను వారి కుటుంబవాదాన్ని ప్రశ్నిస్తే, ఈ వ్యక్తులు మోదీకి కుటుంబం లేదని చెప్పడం ప్రారంభించారు. 140 కోట్ల మంది దేశప్రజలు నా కుటుంబం, ఎవరూ లేని వారు కూడా మోదీకి చెందినవారే, మోదీ వాళ్లకు చెందినవారని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. నా భారతదేశం నా కుటుంబం..' అని మోదీ చేసిన వ్యాఖ్యలు 'మోదీ కా పరివార్' నినాదాన్ని హైలెట్ చేసేలా మారాయి.
Also Read: ఏపీలో ‘తాకట్టులో సచివాలయం’ వార్తా కథనంపై పొలిటికల్ వార్..