హైదరాబాద్ నగరంలో కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి కూడా చలి వణికిస్తుంటే..స్లోగా నేను ఎక్కడికి వెళ్లలేదు అంటూ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు వరుణుడు. తాజాగా గురువారం ఉదయం నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఎర్రగడ్డ, కృష్ణానగర్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్ లలో ఒక్కసారిగా వాన పడడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఉదయాన్నే స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వారు ఈ అకాల వర్షంతో కష్టాలు పడుతున్నారు. వానకాలం అయిపోయింది కదా అని గొడుగులను అటక ఎక్కించిన వారు మళ్లీ వాటికి దుమ్ము దులపాల్సి వస్తుంది. అసలే చలికాలం పైగా కార్తీక మాసం ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసే వారు చాలా మందినే ఉంటారు.
వారికి టైమ్ కానీ టైమ్ లో వానలు పడుతుండడంతో పాపం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత రెండు రోజులు నుంచి నగరంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ పక్క ఎండ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. మరో పక్క చల్లని వాతావరణం.. మధ్యాహ్నాం వరకు బాగానే ఉంటున్నా..ఆ తరువాత చలిపులి కూడా విజృంభిస్తుంది.
రాత్రి 8 దాటిన తరువాత అసలు కాలు బయటపెట్టాలి అంటేనే ఏదో ఐస్ ల్యాండ్ కి వెళ్లిన ఫీలింగ్ వస్తుందని చాలా మంది వాపోతున్నారు. ఇప్పుడు ఈ వానలు కూడా తోడవ్వడంతో అసలు ఎలా ఉండాలో అంటూ మొరపెట్టుకుంటున్నారు. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also read: బిర్యానీ కోసం 60 సార్లు పొడిచి చంపేశాడు!