ఆగస్టు 15లోగా కాంగ్రెస్.. రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒకవేళ రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి మీరు రాజీనామా చేస్తారా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హరీష్ రావు మాట్లాడారు. ' ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలను నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసే బాధ్యత విపక్ష పార్టీగా మాపై ఉంది. ఎల్లుండి అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తాను. ఆగస్టు 15లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రమాణం చెయ్యాలి.
ఆగస్టు 15లోగా పూర్తిగా రుణమాఫీ చేయాలి. ఒకవేళ మీరు రుణమాఫీ చేస్తే.. నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ బై ఎలక్షన్‌లో కూడా నిలబడను. రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా' అని హరీష్ రావు ప్రశ్నించారు. 120 రోజులు గడిచినా కూడా మీ గ్యారెంటీలు ఏమయ్యాయని నిలదీశారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500 ఎందుకు ఇవ్వలేదని.. రైతులకు ఎకరానికి రైతు బంధు రూ.15,000 ఎందుకు ఇవ్వలేదని.. ధాన్యానికి రూ.500 బోనస్ ఏదని.. నిరుద్యోగులకు భృతి ఎక్కడుందని ప్రశ్నించారు.
Also Read: హైదరాబాద్‌లో వరుస విషాదాలు.. వేర్వేరు చోట్ల ఇద్దరిపై నుంచి వెళ్లిన బస్సులు!