జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని మోరంచపల్లి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. మోరంచపల్లిలో మొరంచ వాగు ధాటికి గ్రామం అల్లకల్లోలమైంది. దీంతో ఊరిని మొత్తం వరద చుట్టుముట్టింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఇండ్లు మొత్తం నీటమునిగాయి. ఇండ్లపైకి చేరుకున్న గ్రామప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తెల్లవార్లు గడిపారు. గ్రామ శివారులోకి వరద వచ్చి చేరడంతో ఇళ్లన్ని నీట మునిగాయి. వెంటనే రంగంలోకి దిగిన సహాయిక బృందాలు గ్రామస్తులను రక్షించేందుకు హెలికాప్టర్లు, బోట్లతో ఎంట్రీ ఇచ్చారు. అందరినీ సురక్షితంగా కాపాడారు.
కాస్త మొరంచ వాగు శాంతించడంతో జలదిగ్భందంలో చిక్కుకుని మునిగిపోయిన ఇళ్లు తేలాయి. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇంటిలోని సామాన్లు, ఇతర వస్తువులు, వంట గిన్నెలు ప్రతీ వస్తువూ నీటిలో తేలియాడుతుంటే బాధిత కుటుంబాలు విలవిలలాడాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు కూడా కొట్టుకుపోయాయి.
ఈ క్రమంలోనే శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి (MLA Gandra Venkata Ramana reddy), జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి (Gandra Jyothi) మోరంచపల్లికి చేరుకున్నారు. ఇంటింటికి తిరిగి బాధితులను పరామర్శించారు. బాధితుల క్షేమసమాచారాలు అడిగితెలుసుకున్నారు. పలువురు వరద ఉధృతిని గురించి గండ్ర దంపతులకు వివరించారు. కాగా బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ముంపు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి బోట్ల ద్వారా తరలించారు. అక్కడి నుంచి పునరావాస కేంద్రానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తరలించాయి. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను అధికారులు రక్షించారు. సహాయక చర్యల్లో 2 హెలికాప్టర్లు పాల్గొన్నాయి. గ్రామస్తులను 6 ఫైర్ డిపార్ట్‌మెంట్ బోట్లు తరలించాయి. గ్రామం మొత్తాన్ని అధికారులు ఖాళీ చేయించారు. వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా సిబ్బంది రెస్క్యూ చేశారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. అలాగే హైదరాబాద్ లో కూడా శుక్రవారం ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. దీంతో నగర ప్రజలు బయటకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తోంది.