/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-26-7.jpg)
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఆయన అధికారులతో కలిసి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. '' స్కిల్ సెన్సస్‌లో భాగంగా యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, స్కిల్స్‌ను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తుంది. ఈ ప్రొఫెల్స్‌ను ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తాం. తద్వారా ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకొస్తాం. ఎడ్యుకేషన్, స్కిల్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాలి. ఇదే సమయంలో యువత, ప్రజలను అపోహలకు గురిచేసే అనవసరమైన ప్రశ్నలు అడగొద్దు.
Also Read: టీచర్లకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్..!
స్కిల్ సెన్సస్ సర్వే అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమే. ఆ దిశగా నైపుణ్య గణన జరగాలి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు.. జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలి. నైపుణ్య గణన తరువాత యువతలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు చర్యలు చేపడతాం. యువత తమకు ఉద్యోగాలు దొరకడం లేదని అంటున్నారు. ప్రఖ్యాత కంపెనీలు నైపుణ్యం ఉన్న యువత దొరకడం లేదని చెబుతున్నాయి. అందుకే ఈ రెండు సమస్యలకు సమాధానంగా నైపుణ్య గణన జరగాలి. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడం, యువతకు ఉద్యోగాల కల్పించడం.. ఈ రెండు అంశాలే నైపుణ్య గణన అంతిమ లక్ష్యం.
పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధమైన తర్వాత మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సస్ సర్వే చేపట్టాలని'' మంత్రి లోకేష్ అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్కిల్ సెన్సస్ కోసం రూపొందించిన యాప్‌లో ఉన్న అంశాలను అధికారులు ఆయనకు వివరించారు. అయితే యాప్‌లో పలు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని లోకేష్ అధికారులకు సూచించారు. అలాగే న్యాయపరమైన చిక్కులను తొలించి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. వర్సిటీల ర్యాకింగ్స్ మెరుగుపడేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచనలు చేశారు. ఈ సమీక్షలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్ గౌర్, స్కిల్ డెవలప్ మెంట్ ఎండీ గుమ్మాల గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: 17 మంది చావుకు కారణమైన ఆ కంపెనీ ఓనర్ ఎక్కడ.. ఇంత నిర్లక్ష్యమా?