Telangana Minister KTR: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) మరోసారి తీవ్రంగా స్పందించారు. కేంద్రం అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేస్తే.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉంటాయనేది వివరిస్తూ ఓ జాతీయ మీడియా సంస్థ గ్రాఫ్ విడుదల చేసింది. దీనిని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. ఇదే నిజమైతే ప్రజా సంగ్రామం తప్పదంటూ క్యాప్షన్ పెట్టారు. 'ఈ డీలిమిటేషన్ రిపోర్ట్‌లో పేర్కొన్న సంఖ్యలు సరైనవే అయితే.. మొత్తం దక్షిణ భారతదేశంలో బలమైన ప్రజా ఉద్యమానికి దారి తీస్తుంది. భారతీయ పౌరులుగా, దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రా ప్రతినిథులుగా గర్విస్తున్నాం. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికపై ప్రజల గొంతుకను, ప్రాతినిథ్యాన్ని అణిచివేస్తామంటే చూస్తూ మౌన ప్రేక్షకులుగా ఊరుకోబోం. ఈ విషయంలో పునరాలోచన చేస్తారని, ఢిల్లీ దీనిని గమనిస్తుందిన విశ్వసిస్తున్నాను.' అంటూ మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
IndianTechGuide పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్‌లో డీలిమిటేషన్‌కు సంబంధించి గ్రాఫ్ షీట్‌ను షేర్ చేశారు. జాతీయ మీడియా సంస్థ ఈ లెక్కలను అంచనా వేస్తూ గ్రాఫ్ వేసింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. 2026 లో ఆయా రాష్ట్రాల్లో జరిగే మార్పులు ఇవే అంటూ ఆ గ్రాఫ్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం.. పేర్కొన్న 21 రాష్ట్రాల్లో కలిపి దక్షిణాది రాష్ట్రాలు ఉన్నవాటిలో 36 సీట్లు కోల్పోతే.. ఉత్తరాది రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్నవాటికి తోడుగా మరో 36 స్థానాలు అధికంగా పొందుతాయి. అయితే, దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా.. కేవలం 21 రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే పేర్కొనడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థానాలను లెక్కలోకి తీసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..
ఈ లెక్కల ప్రకారం మన రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ స్థానాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసుకుందాం. జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్విభజన చేసినట్లయితే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సభ సట్లు తగ్గనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిపితే తెలుగు రాష్ట్రాల లోక్ సభ సీట్ల సంఖ్య 37కు తగ్గనుంది. అదే.. 2026 జనాభా లెక్కల ఆధారంగా నియోజకర్గాల పునర్విభజన జరిపితే.. ఇరు రాష్ట్రాలకు కలిపి కేవలం 34 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కనున్నాయి. దీంతో ఎలా జరిగినా కూడా తెలుగు రాష్ట్రాలు 5-8 ఎంపీ సీట్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
నెటిజన్ల మండిపాటు..
ఈ లెక్కలను చూపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. కాగా, కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుందని తాము భావించడం లేదన్నారు. ఒకవేళ అదే జరిగితే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. దేశ జీడీపీలో 33 శాతం ఉంటే.. చట్టసభల్లో మాత్రం దక్షణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం కేవలం 20 శాతమే ఉండనుందని విశ్లేషిస్తున్నారు.
పోరుబాట..
దేశంలో రాజకీయాలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ కేసీఆర్ ఈ అశంపై ఆందోళనకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం రాదన్న హామీని ఇవ్వాలని ప్రధాని మోదీని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గతంలో కూడా ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. జనాభాను నియంత్రించాలన్న కేంద్రం సూచనలు పాటించిన దక్షిణాది రాష్ట్రాలు లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనతో తీవ్ర అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read:
AP Assembly Updates: కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక బిల్లులకు ఆమోదం!
Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా