విజయవాడ ఇంద్ర కీలాద్రి పై శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం దుర్గాష్టమి ని పురస్కరించుకొని కొండ మీద అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రేపు ఉదయం 3 గంటల నుంచి కూడా అమ్మవారు మహిషాసుర మర్థని అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు.
మహిషాసుర మర్ధని, రాజరాజేశ్వరీ గా రేపు అమ్మవారు దర్శనం ఇస్తారు అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.శ్రవణా యోగం ఉన్న సమయంలోనే శమీపూజలు కూడా నిర్వహిస్తామని ఆయన వివరించారు. అమ్మవారికి అలంకరన మార్చే సమయంలో అంటే మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు దర్శనానికి అనుమతి లేదని ఆయన తెలిపారు.
అమ్మవారి ఉత్సవ విగ్రహాలని సాయంత్రం 4:30 కి కొండ మీద నుంచి బయల్దేరి 5:30 కి దుర్గా ఘాట్ లో హంస వాహనం మీద నదీ విహారం చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆనవాయితీగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు తరలించనున్నట్లు ఆయన వివరించారు.
సోమవారమే విజయ దశమి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని ఆయన పేర్కొన్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచీ గురువారం వరకూ భవానీల తాకిడి ఉంటుంది.. హంసవాహనంలో తెప్పోత్సవం జరిగేప్పుడు 30 మందికే అవకాశం ఉందని మంత్రి అన్నారు.
రేపు ఉదయం ఎండోమెంట్, పోలీసు, రెవెన్యూ డిపార్ట్ మెంట్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మీటింగ్ కి డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా ఉంటారని తెలిపారు. భక్తుల మీద కొందరు పోలీసులు ఆజమాయిషీ చేశారని మా దృష్టికి వచ్చిందని మంత్రి వెల్లడించారు. అవసరానికి మించి చేయకూడదని ఆయన అన్నారు.