చంద్రబాబుపై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్ముని జన్మదినాన్ని అబాసుపాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజు చంద్రబాబు దీక్ష చేయడం అంటే మహాత్ముని జయంతి విలువలను దిగజార్బడమే అవుతుందన్నారు. అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అన్నారు. న్యాయ స్థానాలు చంద్రబాబును దొంగగా ప్రకటించాయన్నారు. న్యాయస్థానాలు దొంగగా ప్రకటించిన వ్యక్తి జైల్లో దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ శ్రేణులు కంచాలు మోగించడం ఏంటని మేరుగు నాగార్జున ప్రశ్నించారు.
టీడీపీ అంటేనే ఓ పిచ్చి పట్టిన పార్టీ అన్న ఆయన.. ఆ పార్టీ నేతలు చంద్రబాబును జైల్లో వేయడంతో ఏం చేయాలో తోచక పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కంచాలు మోగించడం కూడా వారి పిచ్చిలో భాగమే అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఇంట్లో ఆడవాళ్లు సైతం దీక్షలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 175 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టలేని వ్యక్తి జైల్లో దొంగ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేదని టీడీపీ నేతలు అంటున్నారన్న ఆయన.. తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయే రానున్న ఎన్నికల్లో తెలుస్తోందన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మేరుగు నాగార్జున.. వపన్ కళ్యాణ్ గతంలో తాను ముఖ్యమంత్రి అవుతానని రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పవన్ తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని అంటున్నారంటే అతను ఎంతకు అమ్ముడు పోయాడో తెలుస్తోందని విమర్శించారు. పవన్ రాజకీయాల్లో సినిమా డైలాగులు వేస్తున్నారన్న ఆయన.. రాజకీయాల్లో సినిమా డైలాగులు పనికి రావని, ఇలాంటి డైలాగులు వేసే గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ మళ్లీ ఓడిపోవడం ఖాయమని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.