జులై 4న ముంబయిలోని మెరైన్ రోడ్డులో టీమిండియా విజయోత్సవ ర్యాలీ జరిగిన సంగతి తెలిసిందే. టీ-20 ప్రపంచ కప్ గెలిచిన భారత ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్‌లో నిల్చొని ట్రోఫితో అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు. తమ అభిమాన ప్లేయర్లను చూసేందుకు వేలాదిమంది క్రికెట్ ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. ఏకంగా 1.7 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు అభిమానులతో కిక్కిరిసిపోయింది. సుమారు రెండు గంటలకు పైగా ఈ పరేడ్ జరిగింది. అయితే పరేడ్ ముగిశాక అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఆ రోడ్డుపై మాత్రం పెద్ద మొత్తంలో వ్యర్థ పదార్థాలు, చెత్త అలాగే ఉండిపోయింది.
Also Read: ఇకనుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష
ఆరోజు రాత్రి 11.30 గంటలకు పారిశుద్ధ్య కార్మికులు రంగంలోకి దిగారు. రోడ్డుపై పేరుకుపోయిన ప్లాస్టిక్ బాటిళ్లు, బట్టలు, చెప్పులు, షూలు, కప్పులు, పేపర్లు ఇలాంటివన్నింటినీ కూడా శుభ్రం చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ రోడ్డుపై ఏకంగా 11,500 కిలోల చెత్త పేరుకుపోయింది. అయినప్పటికీ కూడా బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సిబ్బంది ఆ రాత్రంతా కష్టపడి చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. మొత్తం క్లీనింగ్ ఆపరేషన్ తర్వాతి రోజు ఉదయం 8 గంటల నాటికి పూర్తయ్యింది.
అయితే ఆ రోడ్డుపై ప్రతిరోజూ ఉదయం వాకింగ్ చేసేందుకు చాలామంది వస్తుంటారు. ఈనేపథ్యంలో వాళ్లకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ రాత్రంతా శ్రమించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పారిశుద్ధ్య కార్మికులపై నెటీజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే రోడ్డుపై సేకరించిన చెత్తను.. రీప్రాసెసింగ్ చేసేందుకు తరలించాలని బీఎంసీ భావిస్తోంది.
Also Read: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.!