మణిపూర్ లో దుండగలు మరోసారి రెచ్చిపోయారు. మణిపూర్ లో చెలరేగిన మంటలు ఇప్పుడప్పుడే ఆరే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా మోరే జిల్లాలో దుండగులు ఎన్నో ఇళ్లకు నిప్పు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని బస్సులను కూడా తగలబెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
పోలీసు సిబ్బందిని తరలించేందుకు ఉపయోగించే బస్సులకు నిందితులు నిప్పు పెట్టినట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా మూడు నెలలుగా కొనసాగుతున్న అల్లర్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవలే అక్కడ ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనతో దేశం అట్టుడుకింది.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో కూడా విపక్షాలు ఈ అంశం గురించి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడం జరిగింది. ఈ అంశాల గురించి ప్రస్తావిస్తూ సీఎం బీరెన్ నేను రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదని గట్టిగా చెప్పారు.
‘నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే ప్రశ్నే లేదు. కానీ, కేంద్ర నాయకత్వం, మణిపూర్ ప్రజలు కోరుకుంటే నేను పదవిని వదిలేస్తాను’ అని ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంతేకాకుండా నేను ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకుడిని. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. కేంద్ర నాయకత్వం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను.మణిపూర్ లో వీలైనంత త్వరగా శాంతి భద్రతలు, శాంతిని పునరుద్ధరించడమే ప్రస్తుతం నా ముందు ఉన్న ప్రధాన లక్ష్యం.