ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ్ సంకల్ప్ సమ్మేళన్ ర్యాలీలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని అన్నారు. రాహుల్ పోరాటం ఒకవేళ విఫలమైతే.. మోదీ పాలనలో ప్రజలకు కష్టాలు తప్పవన్నారు.
పార్టీలో ఏ ఒక్కరు కూడా తీసుకోని నిర్ణయం రాహుల్ గాంధీ తీసుకున్నారంటూ ప్రశంసించారు. యువత, మహిళలు, రైతులు, పేదలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. బీజేపీ చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరుగుతోందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకపోతే.. మోదీకి ప్రజలు బానిసలుగా మిగిలిపోవాల్సి ఉంటందని వ్యాఖ్యానించారు.
కేసులు పెట్టి వేధిస్తున్నారు
విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి రప్పిస్తామని, యువతకు ఉద్యోగ అవకాశాలిస్తామని బూటకపు హామీలతో మోదీ అధికారంలోకి వచ్చారంటూ ఖర్గే విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే మోదీ గ్యారంటీ అంటూ ధ్వజమెత్తారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. వాళ్లపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. వివక్ష పార్టీలకు చెందిన 411 నాయకులపై కేసులు పెట్టి బీజేపీ జైలుకు పంపించినట్లు మండిపడ్డారు.
ఝూర్ఖండ్‌లో ప్రయత్నాలు ఫలించవు
అలాగే విపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసి.. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందంటూ విమర్శించారు. ఝార్ఖండ్‌లో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. ఢిల్లీలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి నేతలు, కార్యకర్తలు కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు.