Pakistan National Assembly : పాకిస్తాన్ (Pakistan) జాతీయ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా దేశంలో నెలకున్న ఆర్ధిక సంక్షోభం (Financial Crisis) పై సంకీర్ణ ప్రభుత్వాన్ని విపక్ష ఎంపీలు నిలదీస్తున్నారు. ఇందులో మాజీ మంత్రి జర్తాజ్ గుల్ (Zartaj Gul) మాట్లాడుతున్నారు. ఆమె సభను ఉద్దేశించి ప్రసంగం చేస్తున్నారు. మధ్యమధ్యలో స్పీకర్ సాధిక్‌ను కూడా సంబోధిస్తున్నారు. అయితే జర్తాజ్ సీరియస్‌గా మాట్లాడుతున్న స్పీకర్ మాత్రం ఆమె వైపు చూడటం లేదు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ప్రజల తరపున వచ్చిన నాయకురాలిని. 1,50,000 ఓట్లతో ఈ సభలో అడుగుపెట్టాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా నావైపు చూడకుండా ఉంటే మాట్లాడలేను. దయచేసి మీరు కళ్లజోడు పెట్టుకొని నాపైపు చూడండి అంటూ ఆమె స్పీకర్ సాధిక్‌ను చమత్కరిస్తూ మాట్లాడారు.
దీనికి సాధిక్ సమాధానం చెబుతూ నేను మీ మాటలు వింటాను కానీ, మహిళల కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడటం మర్యాద కాదని అన్నారు. దీంతో సభలోని సభ్యులందరూ వెంటే నవ్వారు అయితే దీనికి కూడా మహిళా ఎంపీ వెంటనే కౌంటర్ వేశారు. మహిళలను సూటిగా చూడకూడదని మీరు అనుకొని సభలో 52శాతం మహిళలను తొలగిస్తే మీరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే సభలో ఉంటారు అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అవుతోంది.