Sankranti : తెలుగు రాష్ట్రాలతో పాటు సంక్రాంతిని జరుపుకునే ఇతర రాష్ట్రాలు ఏంటో తెలుసా!

తెలుగు నాట సంక్రాంతి అన్నా..పొంగల్‌ అని తమిళనాట పిలిచినా..సంక్రాంత్‌ అంటూ మరో రాష్ట్రంలో పిలిచినా ఒకే విధంగా జరుపుకునే పండుగే సంక్రాంతి. ఈ పండుగ సమయానికి కొత్త పంట ఇంటికి వస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సం క్రమణం అంటారు

New Update
Sankranti : తెలుగు రాష్ట్రాలతో పాటు సంక్రాంతిని జరుపుకునే ఇతర రాష్ట్రాలు ఏంటో తెలుసా!

Makar Sankranti : మరో మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఊరూరా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుంచే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడుతారు. దీనిని నెలగంట అంటారు.

తెలుగు నాట సంక్రాంతి అన్నా..పొంగల్‌ అని తమిళనాట పిలిచినా..సంక్రాంత్‌ అంటూ మరో రాష్ట్రంలో పిలిచినా ఒకే విధంగా జరుపుకునే పండుగే సంక్రాంతి. ఈ పండుగ సమయానికి కొత్త పంట ఇంటికి వస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సం క్రమణం అంటారు.సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. ఇలా ప్రవేశించేటప్పుడు మకరం నుంచి కర్కాటకం దాకా ఉన్నదానిని ఉత్తరాయణం అని..కర్కాటకం నుంచి మకరం దాకా ఉన్న దానిని దక్షిణాయనం అని పిలుస్తారు.

భారతీయులందరూ జరుపుకునే పండుగ సంక్రాంతి. రాష్ట్రాల వారీగా భిన్న సంస్కృతుల్లో , భిన్న పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఈ పండుగను 3 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు పండుగను భోగి అని, తరువాత రోజు సంక్రాంతి అని , మూడో రోజు కనుమ అని పిలుస్తారు.

భోగి రోజు ఇళ్ల ముందు పెద్ద పెద్ద మంటలు వేసి , సంక్రాంతి నాడు కొత్త బియ్యం, పాలు, బెల్లంతో కలిపి చేసిన పొంగలి వంటకం తయారు చేస్తారు. పల్లెటూర్లలో కోడి పందేలు నిర్వహిస్తారు. కనుమ రోజూ పశువులను అందంగా అలంకరించి వాటిని, వ్యవసాయ పనిముట్లను పూజ చేస్తారు.

Also Read : సంక్రాంతి స్పెషల్.. తిరుపతి, సికింద్రాబాద్, నర్సాపూర్, కాకినాడ, లింగపల్లికి ప్రత్యేక ట్రైన్లు!

ఢిల్లీ, హర్యానా... కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ(Delhi), హర్యానా(Haryana) లలో సంక్రాంత్‌ పేరుతో పండుగ జరుపుకుంటారు. ఇక్కడ నేతితో చేసిన హల్వా, ఖీర్‌ ప్రత్యేకంగా వండుతారు.

పంజాబ్‌

పంజాబ్‌ లో మకర సంక్రాంతి పండుగను మాఘిగా జరుపుకుంటారు. పండుగ రోజు తెల్లవారుజామునే భక్తులంతా నదిలో స్నానం చేసి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. వాటిని నదిలో వెలిగిస్తారు.

రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌..

రాజస్థాని భాషలో మకర సంక్రాంతి పేరుతో ఈ పండుగ జరుపుకుంటారు. ప్రత్యేకమైన రాజస్థానీ వంటకాలతో పాటు ఫీని, టిల్‌-పాతి, గజక్‌, ఖీర్‌, ఘెవర్‌, పకోడి, పువా, నువ్వుల లడ్డూ వంటి స్వీట్లు ఈ పండుగకు ప్రత్యేక వండుతారు.

తమిళనాడు

తమిళనాడులో ఈ పండుగను నాలుగు రోజులు పాటు జరుపుకుంటారు. మొదటిరోజు భోగి, రెండవ రోజు ధాయ్‌ పొంగల్‌, మూడో రోజు మాట్టు పొంగల్‌, నాల్గవరోజు కనుమ చేస్తారు. తమిళనాట సాంప్రదాయబద్దంగా పండుగ జరుపుకుంటారు. పశువులను అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో జల్లి కట్టు పేరుతో ఎద్దుల పోటీలు నిర్వహిస్తారు.

అస్సాం..

ఈ పండుగను అస్సాంలో మాఘి బిహూ అని పిలుస్తారు. ఈ పండుగను దాదాపు వారం రోజుల పాటు ఈ పండుగను చేసుకుంటారు. తెలుగు వారు చేసుకునే పొంగల్‌ వంటి ఆహార పదార్థాన్నే ప్రత్యేకంగా వండుతారు. వెదురు, తాటాకులతో తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసి వాటిలో ఆరోజు ముందు భోజనం చేసి భోగి రోజు వాటిని కాల్చేస్తారు.

మహారాష్ట్ర..

మహారాష్ట్రలో కూడా ఏపీలో మాదిరిగానే సంక్రాంతి లాగానే చేసుకుంటారు. నువ్వులతో ప్రత్యేకంగా చేసిన వంటకాలను చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. నువ్వులు శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచటానికి ఉపయోగపడతుంది.

గోవాలో కూడా సంక్రాంతి పేరుతోనే పండుగను జరుపుకుంటారు.

గుజరాత్‌ లో మకర సంక్రాంతి పేరుతో పిలిచే ఈ పండుగను రెండు రోజుల పాటు జరుపుకుంటారు. ప్రధానంగా గాలిపటాలు ఎగరవేసి ఈ పండుగను జరుపుకుంటారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఈ పండుగను మాఘాసాజీ అని పిలుస్తారు. సాజి అనేది సంక్రాంతికి పర్యాయపదం
.
ఉత్తరాఖండ్‌ లో మకర సంక్రాంతి పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ధాన్యాలు, బియ్యం దానంగా ఇస్తారు. ఈరోజు నుంచి ఉత్తరాఖండ్‌ కి వలస పక్షలు తిరిగి వస్తుంటాయి.

ఉత్తరప్రదేశ్‌..ఈ పండుగను కిచేరి అని పిలుస్తారు. గుజరాత్‌, మహారాష్ట్రల మాదిరిగానే ఇక్కడ కూడా యువత గాలిపటాలు ఉత్సాహంగా ఎగురవేస్తారు.

ఒడిషా ఒడిషాలో మకర చౌలా పేరుతో సంక్రాంతిని జరుపుకుంటారు. కోణార్క్‌ లోని సూర్య దేవాలయానికి ఈరోజున భక్తులు పోటెత్తుతారు.

పశ్చిమ బెంగాల్‌..సంక్రాంతి పండుగను పౌష్‌ అనే పేరుతో పిలుస్తారు. గంగానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. దీన్ని పౌష్ పర్బన్ అనే పేరుతో కూడా జరుపుకుంటారు.

డార్జిలింగ్‌..ఇక్కడ ఈ పండుగను మాగీ సక్రతి అని పిలుస్తారు. ఈరోజున ప్రజలు శివున్ని ఆరాధిస్తారు. పండుగ తరువాత రోజు లక్ష్మీ దేవిని పూజిస్తారు.

బీహార్‌ & జార్ఖండ్
ఈ పండుగను బీహార్‌, జార్ఖండ్‌ లలో 15 వ తేదీన మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఉత్సాహంగా గాలిపటాలు ఎగరేసి ఆనంద డోలికల్లో మునిగిపోతారు. ఈరోజున ప్రత్యేకంగా క్యాలీఫ్లవర్‌, బఠానీలు, బంగాళదుంపలు, పప్పు, బియ్యంతో కలిపి ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ప్రత్యేక కిచిడీని తయారు చేసి పాపడ్‌, నెయ్యి కూరగాయలతో చేసిన వంటకాన్ని ప్రజలంతా కలిసి ఆనందంగా జరుపుకుంటారు.

కర్ణాటక ..

దీన్ని కర్ణాటకలో సుగ్గీ లేదా పంటల పండుగ అని పిలుస్తారు. నువ్వులు, బెల్లం, చెరుకు, కొబ్బరి, వేరుశెనగతో చేసిన పిండి వంటలను పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటారు.

కేరళ..

కేరళ(Kerala) మకరవిళక్కు పేరుతో ఎంతో ఉత్సాహాంగా జరుపుకుంటారు. శబరిమల(Sabarimala) లో కొండల్లో కనువిందు చేసే మకర జ్యోతి దర్శనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమల కొండకు చేరుకుంటారు.

Also Read : సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి శుభవార్త.. హైదరాబాద్ నుంచి 20 స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు