స్నేహం పేరుతో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన పాపానికి ఫ్రెండ్ అని చూడకుండా దారుణంగా చంపేశాడు ఓ యువకుడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న క్రమంలో ఏర్పడిన పరిచయంతో తీసుకున్న పైసలు పెట్టిన గడువులోగా చెల్లించకపోగా తిరిగి అప్పు ఇచ్చిన వాడినే బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఎదురుపడిన అతడిని బాకీ ఇచ్చిన యువకుడు నిలదీశాడు. అయితే ఈ విషయాన్ని అవమానంగా భావించి కత్తితో పొడిచి బాధితుడిని చంపేశాడు.
Also read : దీపావళి రోజే దారుణం.. ప్రేమించి పెళ్లాడిన భార్యను ఏం చేశాడంటే
ఈ మేరకు కడప చిన్నచౌకు ఠాణా పరిధికి చెందిన సీఐ నరసింహారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వైయస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపంపల్లెకు చెందిన పి.సాయికిరణ్ (25) బీటెక్ చదివారు. కొద్ది రోజులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసి జాబ్ మానేశారు. అయితే ఉద్యోగంలో భాగంగా పరిచయమైన కడప నగరానికి చెందిన మహేంద్ర అనే స్నేహితుడికి రూ.50 వేలు అప్పు ఇచ్చారు సాయి. వాటిని మూడు నెలల్లో తిరిగి ఇస్తానన్న మహేంద్ర గడువు తీరినా ఇవ్వలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి టీ దుకాణం వద్ద వారిద్దరూ కలిశారు. డబ్బుల గురించి మరోసారి వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో సాయికిరణ్ దుర్భాషలాడారు. దీంతో కోపోద్రిక్తుడైన మహేంద్ర తన వద్ద ఉన్న కత్తితో సాయికిరణ్ కడుపులో పొడవడంతో ఆయన కుప్పకూలిపోయారు. ఆ వెంటనే మహేంద్ర తన కారులోనే సాయికిరణ్‌ను నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించడంతో మృతదేహాన్ని అదే కారులో నేరుగా చిన్నచౌకు ఠాణాకు తీసుకొచ్చి విషయాన్ని పోలీసులకు చెప్పి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మహేంద్రపై కేసు నమోదు చేసి మరిన్ని వివరాలకోసం విచారణ జరపుతున్నట్లు వెల్లడించారు.