Rahul Gandhi: ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ.. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ హిందూ ఆలయం (Maharashtra Temple) బయట రాహుల్ గాంధీ ఫొటో ఉన్న డోర్‌మ్యాట్‌ను (Door Mat) వినియోగిస్తున్నారు. హిందువులు హింసావాదులని పిలవడానికి మీకెంత ధైర్యం ? అని ఆ డోర్‌మ్యాట్‌పై హిందీలో రాశారు. ఆ ఆలయంలోకి వెళ్లే భక్తులు తలుపు బయట ఉన్న ఆ డోర్‌మ్యాట్‌ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Also Read: హెచ్‌ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్
ఇదిలాఉండగా.. జులై 1న లోక్‌సభలో (Lok Sabha) విపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీని (BJP) తీవ్రంగా విమర్శించారు. తన ప్రసంగంలో హిందువులు అని చెప్పుకునేవారు.. హింస, విద్వేషాన్ని ప్రేరేపిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని మోదీ (PM Modi) జోక్యం చేసుకుని రాహుల్.. హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి మళ్లీ రాహుల్ గాంధీ స్పందిస్తూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే హిందూ సమాజం కాదంటూ కౌంటర్ ఇచ్చారు.
అనంతరం సోషల్ మీడియాలో రాహుల్.. హిందువులను కించపరిచేలా మాట్లాడారంటూ విమర్శలు వచ్చాయి. మరోవైపు ఆయన మొత్తం హిందూ సమాజాన్ని అనలేదని.. కేవలం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను మాత్రమే టార్గెట్ చేసి విమర్శించారని మరికొందరు నెటిజన్లు ఆయనకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో.. మహారాష్ట్రలో హిందూ ఆలయం గుమ్మం బయట రాహుల్ ఫొటోతో డోర్‌మ్యాట్‌ను వాడటం దుమారం రేపుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటీజన్లు విభిన్నరీతిలో స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై తమ కోపాన్ని చూపించుకునేందుకు హిందువులకు హక్కు ఉందని ఈ వీడియోకు స్పందిస్తూ.. ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఇలా చేయడం సిగ్గుచేటని.. ప్రజాస్వామ్యానికి ఇది తప్పుడు సంకేతం అంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు.
Also Read: సోషల్ మీడియోలో ట్రెండవుతున్న “JioBoycott” హ్యాష్‌ట్యాగ్!