Telangana BJP First List: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే 195 అభ్యర్థులను ప్రకటించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది బీజేపీ. తెలంగాణలో 17 సీట్లకుగాను ఏకంగా 9 పార్లమెంట్ సీట్ల ప్రకటనతో ఎన్నికలకు రెడీ అయింది. అయితే అందరూ అనుకున్నట్టే ఆదిలాబాద్ (Adilabad) సిట్టింగ్ సీటును పెండింగ్‌లో పెట్టింది అదిష్టానం. సిట్టింగ్ ఎంపి సోయంబాబురావుకు టికెట్ ఇంకా ఖరారు చేయకపోవడంతో ఆ పార్లమెంట్ కాషాయసేనలో హైటెన్షన్ నెలకొంది. ఆదిలాబాద్ హాట్ సీట్ కావడం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు భారీ విజయాన్ని అందుకోవడంతో అందరి చూపును అకర్షిస్తోంది. అయితే ఆరునూరైనా సీటునాదేనని.. గెలిచేది కూడా నేనే అని కుండ బద్దలు కొడుతున్నారు బాబురావు (Soyam Baburao).
తనకు టికెట్ రాకుండా సొంత పార్టీ అగ్ర నేతలే అడ్డుపడుతున్నారని.. టికెట్ ఇస్తే ఎక్కడ గెలిచి కేంద్రమంత్రిని అయిపోతానో అన్న భయం పార్టీ కీలక నేతల్లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ (BJP) అధిష్టానం మొదటి లిస్టులో తన పేరును ప్రస్తావించలేదని అన్నారు. కొమ్మపై ఆధారపడిన పక్షిని కాదు.. రెక్కల మీద ఆధారపడ్డ పక్షిని.. స్వతహాగా ఎగురగలను.. టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటా అంటూ హెచ్చరించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు నాదే..గెలిచేది కూడా నేనే.. పార్టీ ఏదనేది అధిష్ఠానం ఆలోచించుకోవాలన్నారు. 2019లోటికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం పోటీపడుతున్నారన్నారు. ఏ బలం లేని సమయంలో నా సొంత బలంతో బీజేపీకి విజయం అందించానన్నారు. జెడ్పీటీసీ లను , ఎంపీపీలను, చివరికి నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించానని తెలిపారు. నా బలం బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది.. అందుకే రెండో లిస్ట్‌లో టికెట్ వస్తుందని భావిస్తున్నానన్నారు.
Also Read: తెలంగాణకు మోడీ.. షెడ్యూల్ ఇదే!
హైదరాబాద్‌లో మొగోడే దొరకలేదా..? రాజాసింగ్
కాగా బీజేపీ అధిష్ఠానం తెలంగాణలో 9 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సొంత పార్టీపైనే ఘాటు కామెంట్లు చేసినట్టుగా తెలుస్తోంది. రాజాసింగ్ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఆశించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో "హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు మొగోడే దొరకలేదా..? అంటూ బీజేపీ అధిష్ఠానంపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికీ పార్టీలో చేరని మాధవీలతకు బీజేపీ హైకమాండ్ సీటు కేటాయించడంపై.. రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా అవకాశం దక్కకపోవడంతో.. ఇప్పటికే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్న క్రమంలో.. విజయ సంకల్ప యాత్రలోనూ పాల్గొనకపోవటం ఆ వార్తలకు బలం చేకూరుస్తుంది. అయితే.. విజయ సంకల్ప యాత్రలో పాల్గొనటం గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. "అంటే ఎంటీ" అని సెటైర్లు వేసినట్టు ప్రచారం సాగుతోంది.