Neelam Madhu: గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన నీలం మధు

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న నీలం మధు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. జిల్లా ముఖ్య నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. ఈ రోజు జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. తన గెలుపు సహకరించాలని కోరారు. జగ్గారెడ్డిని కూడా త్వరలో కలవనున్నారు.

New Update
Neelam Madhu: గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన నీలం మధు

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు (Neelam Madhu) పేరును హైకమాండ్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. సీఎం రేవంత్ ను (CM Revanth Reddy) ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసిన నీలం మధు.. జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహతో కూడా భేటీ అయ్యారు. గత ఎన్నికల సమయంలో పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నీలం మధును కాంగ్రెస్ ప్రకటించింది. అయితే.. జిల్లా నేతలు, ముఖ్యంగా దామోదర్ రాజనర్సింహ ఒత్తిడితో కాట శ్రీనివాస్ గౌడ్ కు బీఫామ్ ఇచ్చింది. దీంతో నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో పటాన్ చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల తర్వాత నీలం మధు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.
ఇది కూడా చదవండి: Breaking : తెలంగాణలో మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ..!

టికెట్ కోసం సీనియర్ నేత జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు కూడా పోటీ పడ్డా.. చివరకు నీలం మధు వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. రేవంత్ రెడ్డి ఆశిస్సులతోనే ఆయనకు టికెట్ దక్కిందన్న ప్రచారం సాగుతోంది. అయితే.. జిల్లాలో అందరినీ కలుపుకుని వెళ్లాలన్న పార్టీ పద్దల సూచనలతో దామోదర్ రాజనర్సింహను కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. తనను మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో సహకరించిన మంత్రి దామోదర్ కు రుణపడి ఉంటానన్నారు.

ఇందిరా గాంధీ లాంటి మహా నేత ప్రాతినిధ్యం వహించిన ఈ గడ్డ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశాన్ని తనకు కాంగ్రెస్ పార్టీ కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి దామోదర్ సలహాలు, సూచనల మేరకు ఆయన మార్గదర్శకత్వంలో అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్లి మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నీలం మధు వెంట చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. త్వరలోనే జగ్గారెడ్డితో జిల్లా ముఖ్య నేతలను కూడా నీలం మధు కలవనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరులో తనతో పోటీ పడ్డ నాటి కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు నీలం మధుకు ఎంత మేరకు సహకరిస్తారు? అన్న చర్చ స్థానికంగా సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు