BJP: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకోగా ఈ సారి 8 సీట్లు దక్కించుకుని సత్తా చాటింది. మెుత్తం 17 స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టీ పోటీనిస్తూ 8 స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఆ పార్టీ ఈ స్థాయిలో సీట్లు గెలుచుకోవటం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, మెదక్‌లో రఘునందన్ రావు, సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్‌లో బండి సంజయ్, నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్‌లో గోడం నగేష్ విజయం సాధించారు. అయితే స్థానిక పార్టీ బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవకపోగా బీజేపీ అనూహ్యంగా 8 సీట్లు దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ విజయానికి కారణాలేంటి? బీఆర్ఎస్ బలహీనతే కలిసొచ్చాయా? లేక తెలంగాణ ప్రజలు బీజేపీని స్వాగతిస్తున్నారా? అనే అంశాలను తెలుసుకుందాం.
మాటలతోనే మైండ్ గేమ్..
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే పార్లమెంట్ ఎన్నికలకు పక్కా ప్లాన్ తో సిద్ధం అయింది బీజేపీ. బీఆర్ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ మాటలతో మైండ్ గేమ్ ఆడింది. బీఆర్ఎస్ నుంచి సీతారాం నాయక్, పోతుగంటి భరత్, ఆరూరి రమేశ్, సైదిరెడ్డి, బీబీపాటిల్, గోడెం నగేష్ తదితర కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుని వీరందరికీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పని అయిపోయిందని క్రియేట్ చేసి అనేక నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేయడంతో బీఆర్ఎస్ బ్యాంక్ మొత్తం బీజేపీకి మళ్లింది. అంతేకాదు బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దించకపోవడం కూడా బీజేపీకి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, విశ్వేశ్వర్ రెడ్డి మోదీ, నడ్డా లాంటి అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించడం ప్లస్ పాయింట్ అయింది. కవితను అరెస్ట్ చేయడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అనే ప్రచారానికి తెరపడింది. మాదిగ వర్గీకరణ అంశం కూడా బీజేపీ కలిసివచ్చింది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను పోటీకి దించడం కూడా బీజేపీకి కలిసివచ్చింది.
మంత్రి పదువుల రేసులో ఆ నలుగురు..
ఇక తెలంగాణలో గెలిచిన 8 మంది ఎంపీల్లో నలుగురు మంత్రి పదువుల రేసులో ఉన్నారు. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఎంపీలుగా గెలవటం ఇది రెండోసారి. ఈ ఇద్దరు మంత్రి పదవి రేసులో ఉన్నారు. తొలిసారి విజయం సాధించిన డీకే అరుణ, ఈటల రాజేందర్ కూడా మంత్రి పదవి కోసం పోటీ పడే ఛాన్స్ ఉంది. వీరిలో ఈటల, డీకే అరుణకు ఎక్కువగా ఛాన్సులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక కేద్రంలో స్పష్టమైన మెజార్టీతో ఎన్డీయే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ కూటమి అభ్యర్థులు మేజిక్ ఫిగర్ 272ను మించి 295 సీట్లో సత్తా చాటారు. దీంతో ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా పదవి చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.