/rtv/media/media_files/2025/07/28/ivf-treetment-2025-07-28-14-41-33.jpg)
IVF ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనేది సంతానం లేని దంపతులకు పిల్లలను కనడానికి సహాయపడే ఒక ఆధునిక వైద్య విధానం. ఈ ప్రక్రియలో, స్త్రీ అండాలను శరీరం వెలుపల, ప్రయోగశాలలో శుక్రకణాలతో ఫలదీకరణం చేసి, అభివృద్ధి చెందిన పిండాలను తిరిగి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. దీనినే IVF అంటారు. ఈ ప్రక్రియ సాధారణంగా ఈ క్రింది దశల్లో జరుగుతుంది. ముందుగా డాక్టర్లు దంపతులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఇద్దరికీ సంతానోత్పత్తి పరీక్షలు, రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. దంపతుల పరిస్థితిని బట్టి వారికి IVF చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తారు. ముఖ్యంగా మహిళలకు ఎగ్స్ తక్కువగా ఉంటే, పురుషులకు వీర్యకణాలు తక్కువగా ఉంటే ఈ చికిత్సను వైద్యులు సూచిస్తారు.
సాధారణంగాప్రతి స్త్రీలో నెలలో ఒక అండం విడుదలవుతుంది. IVF కోసం అనేక అండాలు అవసరం కాబట్టి, డాక్టర్లు అండాశయాల నుండి ఎక్కువ అండాలను ఉత్పత్తి చేయడానికి హార్మోన్ల ఇంజక్షన్లను ఇస్తారు. అల్ట్రాసౌండ్ పరీక్షలు, రక్త పరీక్షల ద్వారా గుడ్ల అభివృద్ధిని పర్యవేక్షిస్తారు. గుడ్లు తగినంత పరిపక్వం చెందినప్పుడు, వాటిని సేకరించడానికి సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకుంటారు. ఈ ప్రక్రియ సాధారణంగా తేలికపాటి మత్తుతో జరుగుతుంది. డాక్టర్లు ట్రాన్స్‌వాజినల్ అల్ట్రాసౌండ్ గైడెన్స్‌లో ఒక సన్నని సూదిని ఉపయోగించి అండాశయాల నుండి పరిపక్వం చెందిన అండాలను సేకరిస్తారు. అదే సమయంలో, పురుషుడి నుండి వీర్యాన్ని సేకరిస్తారు. సేకరించిన వీర్యం నుండి ఆరోగ్యకరమైన, చురుకైన శుక్రకణాలను వేరు చేస్తారు. సేకరించిన అండాలను, శుక్రకణాలను ప్రయోగశాలలో ఒక డిష్ లో కలిపి ఫలదీకరణం చేస్తారు. కొన్ని సందర్భాల్లో, శుక్రకణం అండంలోకి చొచ్చుకుపోవడానికి కష్టమైతే, ICSI (ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో ఒకే శుక్రకణాన్ని అండంలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. ఫలదీకరణం చెందిన అండాలు పిండాలుగా అభివృద్ధి చెందుతాయి. పిండాలను ప్రయోగశాలలో కొన్ని రోజుల పాటు (2-5 రోజులు) పెంచుతారు, వాటి అభివృద్ధిని పర్యవేక్షిస్తారు. అత్యుత్తమ నాణ్యత గల పిండాలను ఎంపిక చేసి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పిండాలను ఒక సన్నని కాథెటర్ (గొట్టం) ద్వారా స్త్రీ గర్భాశయంలోకి వదులుతారు. ఇది సాధారణంగా నొప్పిలేని ప్రక్రియ. దీని ద్వారా గర్భం ధరించే అవకాశాలను పెంచడానికి ప్రొజెస్టెరాన్ మందులు ఇస్తారు. పిండ బదిలీ జరిగిన సుమారు రెండు వారాల తర్వాత, గర్భం దాల్చిందా లేదా అని నిర్ధారించడానికి రక్త పరీక్ష చేస్తారు. దీనినే బీటా హెచ్సీజీ టెస్టు అని అంటారు.
ఇండియాలో IVF ఖర్చు ఎంత?
ఇండియాలో IVF ఖర్చు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకే సైకిల్ లో గర్భం దాల్చకపోతే, ఎక్కువ సైకిల్ లు అవసరం కావచ్చు, ఇది మొత్తం ఖర్చును పెంచుతుంది. పిండ జన్యు పరీక్ష (PGT), హిస్టెరోస్కోపీ, లాపరోస్కోపీ వంటి అదనపు పరీక్షలు అవసరమైతే ఖర్చు పెరుగుతుంది. సాధారణంగా ఇండియాలో ఒక IVF సైకిల్ ఖర్చు రూ. 1,00,000 నుండి రూ. 2,50,000 వరకు ఉండవచ్చు. ఈ ఖర్చులో మందులు, కన్సల్టేషన్ ఫీజులు, ల్యాబ్ ఛార్జీలు, గుడ్డు సేకరణ,పిండ బదిలీ వంటివి ఉంటాయి. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా కూడా IVF సేవలను అందిస్తున్నాయి, ఉదాహరణకు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఇటీవల IVF కేంద్రాన్ని ప్రారంభించారు.